ఎక్కడికక్కడ అడ్డగింత 

15 Jul, 2018 12:31 IST|Sakshi
అనంతగిరి: నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, చిత్రంలో ప్రహ్లాద్‌రావు

అనంతగిరి: స్వామి పరిపూర్ణనంద బహిష్కరణకు నిరసనగా విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) శనివారం వికారాబాద్‌లో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పరిషత్‌ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. వికారాబాద్‌లోని ఆలంపల్లి ఎంఐజీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వెళ్లేందుకు వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ర్యాలీగా వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శిరీష, సీఐ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నాయకులను అడ్డుకున్నారు. ఆలయం వెలుపల నుంచి వస్తున్న నాయకులను అడ్డగించి వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఎమ్మార్పీ చౌరస్తా వరకు వచ్చిన కొందరిని కూడా అడ్డుకున్నారు. ఈ సమయంలో నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

 
బహిష్కరణ ఎత్తివేయాలి 
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. స్వామి పరిపూర్ణనందాపై బహిష్కరణ సరికాదని, వెంటనే బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విభజించు పాలించు అనే ధోరణిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. స్వామిజీ ధర్మం గురించి మాట్లాడిన్రు తప్పా మరేది కాదన్నారు. అనంతరం వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బందెప్ప గౌడ్‌ మాట్లాడుతూ.. హిందూవుల మనోభావాలకు దెబ్బతినేలా ఎవరూ మాట్లాడొద్దని కోరారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

హిందూవుల జోలికి ఎవరైన వస్తే సహించేది లేదన్నారు. సమాజ హితం కోసం కృషి చేసే పరిపూర్ణనందాను బహిష్కరించడం సరికాదని బీజేపీ రాష్ట్ర నాయకులు పటేల్‌ రవిశంకర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కడిక్కడ ప్రజల గొంతును నొక్కేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు ప్రశాంత్‌కుమార్, గోవర్దన్‌రెడ్డి, ప్రభాకర్, కృష్ణ పంతులు, మ్యాడం దత్తు, బీజేపీ నాయకులు పాండుగౌడ్, సదానంద్‌రెడ్డి, సాయికృష్ణ, మాధవరెడ్డి, శివరాజు, వివేకనందారెడ్డి, పోకల సతీశ్, రాచ శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌కుమార్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, శంకర్, సాయి చరణ్‌రెడ్డి, రాజు, రాము, గిరీశ్‌ కొఠారి, పరుశరాం, కరుణాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

 
వికారాబాద్‌లో న్యాయవాదుల లోక్‌ అదాలత్‌ బహిష్కరణ
వికారాబాద్‌లో ర్యాలీకి మద్దతుగా వికారాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు శనివారం నిర్వహిస్తున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను బహిష్కరించారు. అనంతరం న్యాయవాదులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగరాజు, ప్ర«ధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, సీనియర్‌ న్యాయవాదులు గోవర్దన్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, బస్వరాజు, చౌదరి యాదవరెడ్డి,  శ్రీనివాస్, రవి, రాజు, రాము, ఈశ్వర్, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు