అర్చకుడు సత్యనారాయణ శర్మకు కన్నీటి వీడ్కోలు

3 Nov, 2018 13:58 IST|Sakshi

నివాళులర్పించిన పరిపూర్ణానంద స్వామి

అర్చకుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

బ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ

గీసుకొండ(పరకాల): అర్చకుడు దేవళ్ల సత్యనారాయణ శర్మకు అర్చకులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు.  సత్యనారాయణ శర్మ భౌతిక కాయాన్ని శ్రీపీఠం  అధిపతి  పరిపూర్ణానంద స్వామి సందర్శించి నివాళులర్పించారు. అంతిమయాత్రలో కడదాకా పాల్గొన్నారు.  సత్యనారాయణ శర్మకు భార్య, పిల్లలు లేకపోవడంతో ఆయన అన్న శంకర్‌రావు కుమారుడు సురేష్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.  ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఎనుమాముల, రెడ్డిపాలెం నుంచి వచ్చేవారిని అడ్డుకున్నారు.

అంతిమయాత్రలో తెలంగాణ బ్రాహ్మణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, ప్రధానకార్యదర్శి జీవీఎస్‌ శ్రీనివాసాచారి, అర్బన్‌ జిల్లా అధ్యక్షులు వల్లూరి పవన్‌కుమార్, నాగిళ్ల  శంకర్‌శర్మ, నాయకులు జగన్‌మోహన్‌శర్మ, వాణి,  బీజేపీ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి,  పరకాల బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్, గట్టికొప్పుల రాంబాబు, గ్రామ పెద్దలు ఆడెపు రమేశ్, దొంగల రమేశ్‌ పాల్గొన్నారు. డీసీపీ అనురాధ, ఏసీపీలు ప్రతాప్‌కుమార్, సుధీంద్ర, సీఐ సంజీవరావు, ఎస్‌ఐ రహీంలతో పాటు పలువురు పోలీస్‌ అధికారులు అవాంఛనీయ టనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.  

ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి..
అర్చకుడు సత్యనారాయణశర్మ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే రూ. 10 లక్షల ఎక్స్‌గేషియా చెల్లించి ఆదుకోవాలని బ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ డిమాండ్‌ చేశారు. శుక్రవారం వరంగల్‌ రూరల్‌ జిల్లా మొగిలిచర్లలో సత్యనారాయణశర్మ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అర్చకుల భద్రతపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బ్రాహ్మణ పరిషత్‌ నుంచి సత్యనారాయణ కుటుంబానికి తక్షణ సాయం అందించాలన్నారు.నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు