ఏజెన్సీలో స్వాతి చినుకులు

20 Nov, 2019 10:35 IST|Sakshi
ట్రాలీ ఆటో నడుపుతున్న స్వాతి

ఆటో నడుపుతూ నీటి సరఫరా చేస్తున్న స్వాతి

ఆకాశంలో సగమంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతర్జాతీయంగా విమానాలు, దేశీయంగా మెట్రో రైళ్లు నడుపుతూ మగవాళ్లకు దీటుగా నిలుస్తున్నారు. మెట్రో నగరాల్లో పురుషులతో పోటీ పడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల మూలంగా బయటికి రాలేక తమలోని ప్రతిభను మరుగున పడేస్తున్నారు. కానీ ఇలాంటి కట్టుబాట్లను తెంచుకుని ఆచారాలను పాటిస్తునే స్వంతంగా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న స్వాతిపై ‘సాక్షి’ కథనం.
– ఎస్‌ఎస్‌తాడ్వాయి

నీటి సరఫరా కోసం డ్రైవింగ్‌
సాక్షి, ములుగు : తన వ్యాపారాన్ని విస్తరించుకునే బాధ్యతను తనే మీద వేసుకుంది స్వాతి. దీని కోసం ఏకంగా ఆటోడ్రైవింగ్‌ నేర్చుకుంది. ఉదయం వేళ హోటల్‌ నిర్వాహణకు సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత ఆటోలో క్యాన్లు వేసుకుని మేడారం చుట్టు పక్కల ఉన్న ఊరట్టం, కన్నెపల్లి, నార్లపల్లి, వెంగళరావునగర్,  ప్రాజెక్టు నగర్, తాడ్వాయి, కామారం వరకు ఉన్న పల్లెలకు వెళుతూ నీటిని సరఫరా చేస్తోంది. మధ్యాహ్నం సమయానికల్లా మేడారం చేరుకుని హోటల్‌ పనుల్లో నిమగ్నమవుతోంది. సాయంత్రం వేళ తిరిగి వాటర్‌ ప్లాంట్‌ మెయింటనెన్స్‌ను చేపడుతోంది. మహిళా సాధికరత, ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శంగా నిలిచే సమ్మక్క సారలమ్మ చెంత స్వాతి ఆటో నడిపిస్తున్న తీరు చూసి ఇక్కడకు వచ్చే భక్తులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన మహిళలు ఔరా అనుకుంటున్నారు.

సమస్యలు వస్తే తమ వైపు చూడకుంటా తన కాళ్లపై తాను నిలబడుతూ తన పిల్లలకు మంచి భవిష్యత్‌ అందించేందుకు స్వాతి పడుతున్న తపన చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఈ అంశంపై స్వాతిని ’సాక్షి‘ పలకరించగా ఒకరిపై ఆధారపడకుండా ఉండేందుకు డ్రైవింగ్‌ నేర్చుకున్నాని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని చెబుతుంది. ఆడవాళ్లు ఏ అంశంలో తక్కువ కాదని, ఏ రంగంలోనైనా రాణించగలరని అంటుంది. అడవుల గుండా ఆటో నడిస్తున్నప్పుడు భయంగా ఉండదా అని ప్రశ్నిస్తే సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఉంటూ భయమెందుకు అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. ఈ మాటతీరు చూస్తేనే తెలుస్తుంది  స్వాతి ఎంత ధైర్యంగా ముందుకెళ్తుందో..

తాగునీటి సరఫరా.. ఉపాధి
మేడారం వంటి ఏజెన్సీ ఏరియాల్లో తాగునీటి కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులు గమినించింది. ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు తనకు ఉపాధి దొరుకుతుందనే అంచనాతో ధైర్యం చేసి దట్టమైన అడవుల మధ్య ఉన్న మేడారంలో వాటర్‌ ప్లాంటు నెలకొల్పింది. ప్లాంటు నెలకొల్పిన తర్వా త మేడారంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల నుంచి డిమాండ్‌ వచ్చింది. దీంతో వారికి కూడా నీటిని అందించాల ని అనుకుంది కానీ సరఫరా చేయడం కష్టంగా మారింది. ఆదివారం, సెలవు రోజులు తప్పితే మేడారం వైపు వచ్చే ఆటోలు తక్కువ. దీంతో మినరల్‌ వాటర్‌ను కావాల్సిన వాళ్ల కు సరఫరా చేయడం తలకు మించిన భారమైంది. స్థానికంగా ఉన్న ఆటో వాళ్లను సర్వీస్‌ అడిగితే రానన్నారు. ఏజెన్సీ పల్లెల్లో తాగునీటికి డిమాండ్‌ ఉంది, తన దగ్గర వాటర్‌ ఉం ది, సమస్యల్లా సరఫరా చేయడం. రోజుల తరబడి ఎదు రు చూసినా నీటిని సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకు రా లేదు. సమస్య ఉన్న చోటనే అవకాశం ఉంటుందనే నానుడిని అనుసరిస్తూ తానే ఆటో డ్రైవింగ్‌ చేసేందుకు స్వాతి ముందుకొచ్చింది. పది రోజుల వ్యవధిలో డ్రైవింగ్‌ నేర్చుకుంది.

మరిన్ని వార్తలు