నన్నూ.. ర్యాగింగ్‌ చేశారు

1 Aug, 2018 08:27 IST|Sakshi
షీ టీమ్‌ ఇన్‌చార్జ్ ఐజీ స్వాతి లక్రా

హైదరాబాద్, సైదాబాద్‌: కాలేజీలో తాను కూడా ర్యాగింగ్‌కు గురయ్యానని, నేడు ర్యాగింగ్‌ చేస్తే కఠినంగా శిక్షిస్తున్నామని, ఆడపిల్లలను ర్యాగింగ్‌ చేయాలంటే  భయపడేలా యాంటి ర్యాగింగ్‌ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు షీ టీమ్‌ ఇన్‌చార్జ్, ఐజీ స్వాతిలక్రా అన్నారు. సరస్వతినగర్‌ కాలనీలోని వైదేహి ఆశ్రమాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ రికార్డులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఓ విద్యార్థి ‘మీరు షీ టీమ్‌ను నిర్వహిస్తున్నారు కదా మీరు చదువుకునే రోజుల్లో ఎప్పుడైన ర్యాగింగ్‌కు గురయ్యారా’ ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. మహిళలకు భరోసా కల్పించేందుకు ఐపీఎస్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. నగరంలో షీ టీమ్‌ల ఏర్పాటుతో 50 శాతం వేధింపులు తగ్గాయన్నారు. ప్రతి మహిళ, యువతికి ఆత్మరక్షణకు కరాటేలో మెళకువలు అవసరమని, ఇందుకోసం ఆశ్రమంలో ఒక శిక్షకుడిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

పెద్ద లక్ష్యాలను నిర్ధేశించుకుని క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. తాను మొదటిసారి విజయం సాధించలేదని, రెండోసారి ప్రయత్నించి ఐపీఎస్‌కు ఎంపికైనట్లు తెలిపారు. వైదేహి ఆశ్రమ పద్దతులు, భద్రత బాగున్నాయని అభినందించారు. కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షురాలు సీతాకుమారి, కార్యదర్శి మురళి, భారతీదేవి, రాములు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు