అట్టహాసంగా స్వాత్మానందేంద్ర పరిచయసభ

27 Jun, 2019 04:13 IST|Sakshi
బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో స్వరూపానంద స్వామికి పుష్పాభిషేకం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో స్వాత్మానందేంద్ర స్వామి 

హాజరైన సీఎం,స్పీకర్‌ పోచారం, మంత్రులు 

చాతుర్మాస దీక్ష తర్వాత తెలంగాణకే వస్తా: స్వాత్మానందేంద్ర 

సామాజిక సేవలో ముందుంటామన్న స్వరూపానంద 

హైదరాబాద్‌లో శారదాపీఠానికి భూమిపూజ 

సాక్షి, హైదరాబాద్‌: శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పరిచయ సభ బుధవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 5 నిమిషాల ముందే సభాస్థలికి వచ్చిన సీఎం కేసీఆర్‌.. స్వాత్మానందేంద్ర, స్వరూపానంద స్వాములకు స్వాగతం పలికి వారిని వేదికపైకి తీసుకొచ్చారు. ఆదిశంకరాచార్యుల చిత్రపటానికి పూజ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ నూతన వస్త్రాలు, తులసిమాల, పుష్పమాలతో స్వాములిద్దరినీ సన్మానించారు. అనంతరం కేసీఆర్, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం విశాఖ శారద పీఠానికి నగర శివారులోని కోకాపేటలో రెండెకరాల స్థలం కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్‌ స్వరూపానంద స్వామికి అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రధాన దేవాలయాలకు చెందిన దేవతా శేషవస్త్రాలు, ప్రసాదాలను ఇద్దరు స్వాములకు అందించారు. కార్యక్రమం చివర్లో స్వాములిద్దరికీ కేసీఆర్‌ పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వరూపానంద స్వామి కేసీఆర్‌కు శేషవస్త్రాలు అందించి సన్మానించారు. 

కోకాపేటలో కేటాయించిన రెండెకరాల భూమి పత్రాలను స్వరూపానంద స్వామికి అందజేస్తున్న కేసీఆర్‌

తెలంగాణ నుంచే ధర్మప్రచారం.. 
తెలంగాణ నుంచే ధర్మప్రచారాన్ని ప్రారంభిస్తానని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందేంద్ర స్వామి ప్రకటించారు. చాతుర్మాస దీక్షలో భాగంగా తెలంగాణ నుంచే హృశికేష్‌కు పయనమవుతున్నానని, కొంతకాలం తపస్సు తర్వాత మళ్లీ తెలంగాణకే వస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తన పరిచయసభ ఉన్నందున, ఇందులో పాల్గొన్న తర్వాతే హృశికేశ్‌కు వెళ్లాలన్న శారద పీఠాధిపతి ఆదేశంతోనే తానిక్కడికి వచ్చానన్నారు. ఈ కార్యక్రమం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. స్వరూపానంద స్వామి మాట్లాడుతూ ఆధ్మాత్మిక, ధర్మ ప్రచారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో శారదాపీఠం ముందుంటుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నగరంలో రెండెకరాల భూమి కేటాయించడం సంతోషమన్నారు. తమ పీఠం విశాఖలో ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌తో సుదీర్ఘ అనుబంధముందన్నారు. ఇక్కడే రెండు పర్యాయాలు చాతుర్మాస దీక్ష నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఇటీవలే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమక్షంలో పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్రను నియమించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

స్వాత్మానందేంద్ర స్వామిని తులసిమాలతో సన్మానిస్తున్న సీఎం కేసీఆర్‌. పక్కన స్వరూపానంద స్వామి

శారదాపీఠానికి భూమిపూజ 
విశాఖ శారదాపీఠానికి హైదరాబాద్‌ శివారులోని గండిపేట మండలం కోకాపేటలో కేటాయించిన రెండెకరాల భూమిలో బుధవారం భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన భూమిని అధికారులు పీఠానికి అప్పగించడంతో బుధవారం పీఠాధిపతి శ్రీస్వరూపానందస్వామి భూమి పూజ చేశారు. పీఠం అర్చకులతో కలసి ఉదయం 10.30 గంటలకు వచ్చిన ఆయన హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండెకరాల భూమిలో ఆలయం, వేదభాషాగోష్టి మఠం, సంస్కృతి విద్యాసంస్థ, విద్యార్థుల వసతిగృహం, భోజనశాల, సమావేశమందిరం తదితరాలు నిర్మించనున్నట్లు సమాచారం. బుధవారం జరిగిన పూజాకార్యక్రమాలకు మీడియాను అనుమతించలేదు. అక్కడకు వెళ్లిన విలేకరులను ఫొటోలు తీయవద్దని మఠం స్వామీజీలు, పోలీసులు కోరారు. ఇదిలా ఉండగా, టీవీ నటుడు రచ్చరవి స్వామీజీని కలసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 

నన్ను పొగడొద్దు: కేసీఆర్‌ 
విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి పరిచయ సభ అయినందున వ్యాఖ్యానంలో తనపై ప్రశంసలు కురిపించవద్దని, ప్రస్తావన తేవొద్దని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణమూర్తి.. కేసీఆర్‌ను ప్రశంసించబోగా, ఇదే విషయాన్ని సీఎం చిట్టీరాసి ఆయనకు పంపించారు. అదే విధంగా జలవిహార్‌ ఎండీ రామరాజు దంపతులు సన్మానించబోగా, కేసీఆర్‌ సున్నితంగా తిరస్కరించారు. 

మరిన్ని వార్తలు