స్విగ్గి డెలివరీ బాయ్స్‌ ఆందోళన

6 Nov, 2018 09:35 IST|Sakshi
స్విగ్గి రెస్టారెంట్‌ ఎదుట ఆందోళ చేస్తున్న డెలివరీ బాయ్స్‌

అమీర్‌పేట: వినియోగదారులకు ఆహార పదార్థాలు డెలివరీ చేస్తున్నందుకు తమకు ఇచ్చే కమీషన్‌ను తగ్గించారని స్విగ్గి డెలివరీ బాయ్స్‌ ఆందోళకు దిగారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని స్విగ్గి రెస్టారెంట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు. అమీర్‌పేట జోన్‌ పరిధిలో సుమారు 250 మంది డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. కాగా వినియోగదారులకు ఫుడ్‌ డెలివరీ చేస్తే సంస్థ ద్వారా రూ.37 చెల్లించేవారన్నారు. అదే విధంగా 7 నుంచి 10 కిలోమీటర్ల దూరానికి ఒక్కో ఆర్డర్‌కు రూ.65 చెల్లిస్తూ 15 డెలివరీలు చేస్తే రూ.200 ఇన్సెంటివ్స్‌ ఇచ్చేవారన్నారు.

అయితే గత రెండు రోజులుగా ఇన్సెంటివ్స్‌ ఇవ్వకపోగా కమీషన్‌ కూడా తగ్గించారని వాపోయారు. కమీషన్‌ను ఎప్పటిలాగే ఇవ్వాలని, ఇన్సెంటివ్స్‌ డబ్బులు యథావిధిగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సంస్థ మేనేజర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని, అప్పటి వరకు డెలివరీలు చేయాలని రెస్టారెంట్‌ ఇన్‌చార్జి కోరారు. అయితే, తమ డిమాండ్లను పరిష్కరించే దాకా డెలివరీలు చేసేదిలేదని బాయ్స్‌ స్పష్టం చేశారు. డెలివరీ బాయ్స్‌ ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం నుంచి అమీర్‌పేట జోన్‌ పరిధిలోని అన్ని ఫుడ్‌ ఆర్డర్లు నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు