క్వారీ గుంతలో ఈత...తల్లులకు గుండెకోత!

16 Apr, 2018 10:27 IST|Sakshi
యాచారం క్వారీలో యువకుల విన్యాసాలు, 20 అడుగుల ఎత్తు నుంచి నీటిలో దూకుతున్న యువకుడు

యాచారం పీఎస్‌ సమీపంలో క్వారీ

ఈత కోసం తరలివస్తున్నచిన్నారులు, యువత

రక్షణ చర్యలు పాటించని అధికారులు

యాచారం: క్వారీలో ఈత కొడితే ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా.. యువత ఆసక్తితో రావడం, అధికారులకు సమాచారం ఉన్న పట్టించుకోకపోవడం వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని తల్లితండ్రులు భయాందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారి సమీపంలో, యాచారం పోలీస్‌ స్టేషన్‌ వెనకాల వ్యాపారులు గ్రానెట్‌ రాళ్ల కోసం క్వారీ తవ్వారు. దాదాపు 20 అడుగుల లోతున్న ఈ క్వారీలో మూడు, నాలుగు అడుగుల లోతు నీళ్లు.. పెద్దపెద్ద బండరాళ్లు గునుపాల మాదిరిగా ఉన్నాయి. వేసవి కాలం కావడంతో ఉపశమనం  కోసం యాచారం మండలంలోని పలు గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది యువత, చిన్నారులు ఈతకు తరలివస్తున్నారు. ఈత సరదాలో కొద్దిపాటి నీటిలో పది అడుగుల ఎత్తు నుంచి దూకుతున్నారు. క్వారీ అడుగు భాగంలో గునుపం లాంటి రాళ్లు ఉండడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి.

నాలుగేళ్ల చిన్నారులు సైతం ఈతకు...
క్వారీలో ఈతకు వివిధ గ్రామాల నుంచి నాలుగేళ్ల చిన్నారులు సైతం తరలివస్తున్నారు. 25 ఏళ్లు పైబడిన యువత మద్యం వెంట తెచ్చుకొని ఈత సరదా మధ్యలో వాటిని సేవిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. మద్యం మత్తులో నీవు ఎంత ఎత్తులోంచి దూకుతావు.. అంటూ బెట్టింగులు కడుతూ ఘర్షణలకు సైతం దిగుతున్నారు. ఇలా సరదా కోసం యువత ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. మైనింగ్‌ శాఖ నింబంధనల ప్రకారం లీజుకు తీసుకుని గ్రానెట్‌ తీసిన వ్యాపారులు అనంతరం క్వారీని పూర్తిగా పూడ్చేయాలి. కానీ యాచారం పోలీస్‌స్టేషన్‌ వెనకాల ఉన్న క్వారీని పూడ్చకుండా అలానే వదిలేశారు. అధికారులకు తెలిసిన పట్టించుకోకపోవడం లేదు. దీంతో నేడు యాచారం క్వారీ యువత ప్రాణాలకు శాపంగా మారింది. ప్రమాదకరంగా ఉన్న క్వారీని వెంటనే పూడ్చడం, లేదా ఈతకు యువత రాకుండా కట్టడి చర్యలు తీసుకోకపోతే చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం తప్పదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా