మళ్లీ ‘స్వైన్‌’ సైరన్‌!

16 Jul, 2019 09:14 IST|Sakshi

రెండు వారాల్లో పదిహేను కేసులు నమోదు

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

సాక్షి, సిటీబ్యూరో:  కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది.  పగటిపూట ఎండలు తగ్గుముఖం పట్టడం, సాయంత్రం చిరుజల్లులకు తోడు చలిగాలులు వీస్తుండటంతో వైరస్‌ బలపడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1227 స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కేవలం రెండు వారాల్లోనే పదిహేను కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే గత ఏడాది 1007 కేసులు నమోదు కాగా, వీరిలో 28 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే 20 మంది మృతి చెందినట్లు అధికారుల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలతో పోలిస్తే గ్రేటర్‌ పరిసర ప్రాంతాల్లోనే ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. చాప కింది నీరులా విస్తరిస్తున్న ఈ స్వైన్‌ఫ్లూపై మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

హైరిస్క్‌ గ్రూప్‌ను వెంటాడుతున్న ఫ్లూ భయం
పదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాండించిన స్వైన్‌ఫ్లూ వైరస్‌ మరోసారి విస్తరిస్తుంది. కేవలం గ్రేటర్‌లోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జిల్లాలోనూ చాప కింది నీరులా విస్తరిస్తుండటంతో సామాన్య ప్రజలే కాదు రోగులు చికిత్స పొందుతున్న ఆయా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, నర్సింగ్, ఇతర వైద్య సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ తమను ఆ వైరస్‌ వెంటాడుతుందోనని  ఆందోళన చెందుతున్నాయి. కేవలం గ్రేటర్‌లో నమోదైన కేసులే కాకుండా జిల్లాల్లో నమోదైన కేసులు సైతం నగరంలోని ఆస్పత్రులకు తరలిస్తుండటంతో హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ఎక్కడ తమకు చుట్టు కుంటుందోనని భయపడుతున్నారు. గతంలో హైరిస్క్‌ జోన్‌లో పని చేస్తున్న సిబ్బందికి రోగి నుంచి వైరస్‌ సోకడమే ఇందుకు కారణం. వ్యాధి నివారణలో భాగంగా వీరికి ముందస్తు వాక్సిన్‌ ఇవ్వాల్సి ఉండగా, స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఈ మందు మచ్చుకైనా కన్పించడం లేదు. వైరస్‌ సోకకుండా ఒక్కక్కరికి ఒక్కో డోసు చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. కానీ స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్‌ లేక పోవడంతో అక్కడ పని చేసే వైద్యులే కాకుండా చికిత్సల కోసం అక్కడికి వస్తున్న రోగులు సైతం భయ పడుతున్నారు. చివరకు ఫ్లూ బాధితుల వద్దకు వెళ్లడానికి కూడా సిబ్బంది జంకుతున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి
సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్లవెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు అవుతాయి. గర్భిణులు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఊబకాయులకు సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. వ్యాధి బారిన పడిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్‌ గాలిలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి బయటికి వచ్చిన వైరస్‌ వాతావరణంలో రెండుగంటలకుపైగా జీవిస్తుంది. ఫ్లూ లక్షణాలతో బాధపడే వారికి దూరంగా ఉండాలి. మాస్కు ధరించండంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. జనసమూహ ప్రాంతాలకు వెళ్లక పోవడమే ఉత్తమం. తీర్థయాత్రలు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఇతరులకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం, కౌగిలించుకోవ డం చేయరాదు. చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు. అనుమానం వచ్చిన వెంటనే వ్యాధి నిర్ధారణ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.  
– డాక్టర్‌ శ్రీధర్, ఉస్మానియా ఆస్పత్రి  

మరిన్ని వార్తలు