మహిళలకు ‘ఫ్లూ’ భయం

30 Sep, 2017 03:24 IST|Sakshi

ఇప్పటి వరకు 40 మంది మృతి

‘గాంధీ’లో మరో 18 మందికి చికిత్స

హైదరాబాద్‌ కేంద్రంగా స్వైన్‌ఫ్లూ..

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. జిల్లాలతో పోలిస్తే నగరంలోనే అత్యధిక కేసులు నమోదు అవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బాధితుల్లో 50 శాతం మంది 45 ఏళ్లు దాటిన మహిళలే కావడం విశేషం. పురుషులతో పోలిస్తే మహిళల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఫ్లూ సులభంగా విస్తరిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొంత కాలంగా ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేసిన హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాలిఫోర్నియా స్ట్రెయిన్‌గా పిలవ బడే ‘మిషిగావ్‌ స్ట్రెయిన్‌’గా రూపాంతరం చెందినట్లు ఇటీవల పుణే వైరాలజీ విభాగం గుర్తించింది. హెచ్‌1ఎన్‌1 వైరస్‌తో పోలిస్తే ఇది మరింత శక్తివంతంగా ఉన్నట్లు నిర్ధారించారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, గర్భిణులు, చిన్నారులపై ఈ వైరస్‌ ఎక్కువగా ప్రభావం చూపుతోంది.

గ్రేటర్‌లోనే అత్యధిక కేసులు..
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 12 మంది స్వైన్‌ఫ్లూ బాధితులు చికిత్స పొందుతుండగా, మరో ఆరుగురు అనుమానితులకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,876 ఫ్లూ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే 1,450 కేసులు నమోదైనట్లు సమాచారం. ఇప్పటి వరకు 40 మంది చనిపోగా, వీరిలో హైదరాబాద్‌కు చెందిన వారే 30 మంది ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి.

ఒకరి నుంచి మరొకరికి
ఠి ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్‌ రోగి శరీరం నుంచి గాలిలోకి ప్రవేశిస్తుంది. ఠి ఇలా ఒకసారి బయటకు వచ్చిన వైరస్‌ వాతావరణంలో రెండు గంటలకుపైగా జీవిస్తుంది. ఠి సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కనిపించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ఠి ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు వస్తాయి. ఠి కళ్లవెంట నీరుకారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఠి ముక్కుకు మాస్కు ధరించడంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.         ఠి వీలైనంత వరకు నీరు ఎక్కువ తాగాలి, పౌష్టికాహారం తీసుకోవాలి. ఠి సాధ్యమైనంత వరకు తీర్థయాత్రలకు వెళ్లకపోవడమే ఉత్తమం.
– డాక్టర్‌ మనోహర్, డైరెక్టర్, నిమ్స్‌

మరిన్ని వార్తలు