విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

9 Mar, 2015 03:27 IST|Sakshi
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ మరింత బలపడుతోంది. ఎలాంటి వాతావరణంలోనైనా విస్తరించేలా తన పరిధిని పెంచుకుంటోంది. కేవలం చలి తీవ్రతలోనే వైరస్ వ్యాప్తి ఉంటుం దన్న వాదనకు కాలం చెల్లుతోంది. వేడి వాతావరణాన్ని కూడా తట్టుకునే శక్తిని హెచ్1ఎన్1 వైరస్ సాధించింది. సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులు ఇతరత్రా కొద్దిపాటి లక్షణాలున్న వారికి కూడా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2009లో ఎంతో తీవ్రమైన వైరస్‌గా ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు స్వైన్‌ఫ్లూ తన విస్త్రృతి పెంచుకుంది. వైరస్ వ్యాప్తి చెందే సమయంలో యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం.. తర్వాత అది వాతావరణంలోకి మరింత విస్తరించడంతో అనేకమందికి సోకుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

రెండు నెలల్లోనే 61 మంది మృతి
స్వైన్‌ఫ్లూ థర్డ్ క్లాస్ ైవె రస్ అని... కాస్తంత ఎండలు కాస్తే అది పోతుందని స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నెలల క్రితం పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయనన్నట్లు స్వైన్‌ఫ్లూ మాత్రం ఇప్పుడలా లేదు. ఇప్పటికీ తన ఉధృతిని చాటుకుంటోంది. 2009లో జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలంగాణ ప్రాంతంలో 638 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఆ ఏడాది 43 మంది చనిపోయారు. అది అప్పట్లో అత్యంత సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మార్చి 6వ తేదీ నాటికి రెండు నెలల కాలంలో 5,419 శాంపిల్స్‌ను పరీక్షించగా... 1,731 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అందులో ఏకంగా 61 మంది చనిపోవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది రెండు నెలల కాలంలోనే అంతమంది చనిపోవడంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. వైరస్ వాతావరణంలోకి విస్తరించిందంటున్నారు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దీనికితోడు పరీక్షల్లో స్వైన్‌ఫ్లూతో పాటు రెండు మూడు పరీక్షలు సాధారణంగా చేస్తార ని.. అదనంగా ఇంకేమైనా కొత్త వైరస్ ఉందా అన్న విషయం ప్రస్తుతం చేస్తున్న పరీక్షల్లో వెల్లడి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌లోనే ఆ వివరాలు బయటపడతాయని అంటున్నారు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

పాలమూరులో మూడుస్వైన్‌ఫ్లూ కేసులు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో తాజాగా మూడు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. రెండురోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన శ్రీశైలం, తెల్కపల్లికి చెందిన బాలరాజు అనారోగ్యం బారినపడటంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. వీరికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉండటంతో నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. వ్యాధి నిర్ధారణ కావడంతో వారిని ప్రత్యేకవార్డులో ఉంచి చికిత్సలు చేస్తున్నారు. అలాగే జడ్చర్ల పట్టణానికి చెందిన కిరణ్‌మయికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పరీక్షలు చేయించకుండా నేరుగా హైదరాబాద్‌లోని హోమియోపతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది.
 
నిర్లక్ష్యం ఫలితమే..

2009లో తీవ్ర వైరస్‌గా ఉన్న హెచ్1ఎన్1 వైరస్... ఇప్పుడు సర్వసాధారణంగా మారినా... దాని సాంద్రత పెరిగిందని కనీస లక్షణాలున్న వారికి కూడా సోకుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొద్దిపాటి జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉన్నా కూడా చాలామందికి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. మొదట్లో తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రత్యేకంగా పర్యవేక్షించడంతో ఉరుకులు పరుగులతో కదిలిన యంత్రాంగం.. ఇప్పుడు కాస్తంత విశ్రాంతి స్థితిలోకి వెళ్లారు. ప్రత్యేక సెల్ కూడా సీరియస్‌గా ఫోన్‌కాల్స్‌ను స్వీకరించడం లేదన్న ఆరోపణలున్నాయి.
 
వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేయాలి
స్వైన్‌ఫ్లూ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం హెచ్1ఎన్1, హెచ్2ఎన్3, ఇన్‌ఫ్లూయెంజా-ఎ పరీక్షలు మూడూ ఒకేసారి చేస్తున్నారు... అందులో ఒకట్రెండు పాజిటివ్ వస్తున్నాయి. హెచ్1ఎన్1 కాకుండా అదనంగా మరో వైరస్ ఏదైనా ఉందేమోనన్న అనుమానాలు కూడా ఉంటున్నాయి. అందువల్ల ప్రత్యేక పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరీక్షించే ల్యాబ్‌లో అది సాధ్యం కాదు. పుణేలో ఉన్న జాతీయ వైరాలజీ ల్యాబ్‌లో శాంపిల్స్‌ను పరీక్షిస్తే స్వైన్‌ఫ్లూతోపాటు ఇంకేమైనా వైరస్ వృద్ధి చెందుతుందా అన్న విషయం బయటపడుతుంది. అందువల్ల హైదరాబాద్‌లోనూ వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
 -డాక్టర్ ఎస్.ఎ.రఫీ, శ్వాసకోశ,  వైద్య నిపుణులు, కేర్ ఆసుపత్రి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు