ముగ్గురు ఐఏఎస్‌లకు స్వైన్‌ఫ్లూ

20 Oct, 2018 03:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మరో నలుగురు అధికారులకు కూడా 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. స్వైన్‌ ఫ్లూతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అక్టోబర్‌ నెల 15 రోజుల్లోనే ఏకంగా 125 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదవటం, ఈ ఏడాదిలో స్వైన్‌ ఫ్లూ కారణంగా ఇప్పటివరకు నలుగురు మృతి చెందటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు సైతం స్వైన్‌ ఫ్లూ తో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అందులో ముగ్గురు ఐఏఎస్‌లు, మరో నలుగురు డీఆర్‌వో, ఆర్డీవో స్థాయి అధికారులున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరి పేర్లు బయటపెడితే వారి వద్దకు ప్రజలు వెళ్లేందుకు ఇబ్బంది పడే అవకాశమున్నందున ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) అధికారులు వెల్లడించడం లేదు.  

వారం రోజుల్లో 20 కేసులు  
నగరంలోని గాంధీ జనరల్‌ ఆసుపత్రిలో గత వారం రోజుల్లో 20 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదయి. ఈ ఏడాది  గాంధీలో 54 మంది స్వైన్‌ ఫ్లూ రోగులు చేరగా  నలుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి 140కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, అక్టోబర్‌ నెల 15 రోజుల్లోనే 124 కేసులు నమోదయ్యాయి. ఐపీఎం ల్యాబ్‌ కు గత నెలలో 439 శాంపిళ్లు రాగా వాటిలో 45, అక్టోబర్‌ మొదటి 15 రోజుల్లో 555 శాంపిళ్లను పరీక్షించగా 125 పాజిటివ్‌ వచ్చాయి. ప్రస్తుతం 34 మంది గాంధీ, ఉస్మానియాల్లో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు