ఆకలిచావులు లేని తెలంగాణే ధ్యేయం

28 Feb, 2017 02:32 IST|Sakshi
ఆకలిచావులు లేని తెలంగాణే ధ్యేయం

ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ను నిలదీయాలి
మంత్రి హరీశ్‌రావు
మీ పాలనలో ఏనాడైనా రైతులు ధర్నా చేయకుండా ఉన్నారా... అని ప్రశ్న


సాక్షి, యాదాద్రి: రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు లేని హరిత తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం భువనగిరి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన పాల్గొ న్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.  దేశంలోనే అత్యధి కంగా రాష్ట్రంలో రూ.600 కోట్లతో 12 లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క మహబూబ్‌ నగర్‌లోనే నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసి 4.50 లక్షల ఎకరాలకు నీరందించామని తెలిపారు. సింగూరు ప్రాజెక్టుతో యాసంగి పంటకు 30 వేల ఎకరాలకు, బోధ్‌లో 40 వేల ఎకరాలకు, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా 60 వేల ఎకరాలకు సాగు నీరందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాని దేనని పేర్కొన్నారు. తమ పాలనలో చేయలేని పనులను మరొకరు చేయొద్దన్న అక్కసుతో మల్లన్నసాగర్‌ను అడ్డుకోవడానికి చనిపోయిన రైతుల పేరుతో కాంగ్రెస్‌ కేసులు వేయించిందని మంత్రి ఆరోపించారు.

మీ పాలనలో ఏనాడైనా రైతులు ధర్నా చేయ కుండా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ను గట్టిగా ప్రశ్నించాలని కార్యకర్తలను కోరారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి,  ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు