పనుల్లో వేగం పెంచండి

20 Aug, 2018 03:39 IST|Sakshi
సమీక్షలో పాల్గొన్న మంత్రి హరీశ్‌ రావు

కేంద్ర ప్రాయోజిత పథకాలపై అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: సాగు నీటి శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏఐబీపీ, డ్రిప్, భూగర్భజలాలు, ట్రిపుల్‌ఆర్‌ పథకాలపై మంత్రి హరీశ్‌రావు జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ట్రిపుల్‌ఆర్‌ పనుల నిమిత్తం కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆరా తీశారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు యుటిలైజేషన్‌ పత్రాలు కేంద్రానికి సమర్పించి రావాల్సిన నిధులు పొందాలని సూచించారు. ఇక డామ్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం (డ్రిప్‌) కింద వరల్డ్‌ బ్యాంకు నిధులతో చేపట్టే పథకంలో భాగంగా రాష్ట్రం నుంచి 33 ప్రాజెక్టు డామ్‌ల ఆధునీకరణ, మరమ్మతులకు రూ.665 కోట్ల కోసం ప్రతిపాదనలు పంపామని అధికారులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు ఎంత పెరిగాయన్న వివరాలను హరీశ్‌ భూగర్భ జలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కేంద్రం నుంచి నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద వచ్చే రూ.70 కోట్ల నిధులతో గ్రౌండ్‌ డేటా సిస్టంను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. భూగర్భ జలాల సమాచారాన్ని డిజిటల్‌ పద్ధతిలో సేకరించడం, భూగర్భ జలశాఖ కార్యకలాపాలు, ప్రణాళికను మరింత ఆధునీకరించడం వంటి పనులు చేపట్టాల్సి ఉందని ఈ ఏడాది రూ.16 కోట్లతో కొన్ని పనులు చేపడుతున్నట్లు మంత్రికి తెలిపారు. ఈ పనులు త్వరగా పూర్తి చేసి కేంద్రం నుంచి మరిన్ని నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలని హరీశ్‌ సూచించారు. భూగర్భ జలాల సమాచార సేకరణకు 800 కొత్త పీజో మీటర్లు, 900 వాటర్‌ లెవల్‌ రికార్డర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ ప్రకాశ్, ఈఎన్సీ మురళీధర్, కాడా కమిషనర్‌ మల్సూర్, ఇరిగేషన్‌ ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు