టీ–హబ్‌ మైల్‌స్టోన్‌

20 Jul, 2018 10:32 IST|Sakshi

నగరంలో కెనడా క్లీన్‌ టెక్నాలజీ

టీ–హబ్‌తో కెనడా డిజిటల్‌ మీడియా నెట్‌వర్క్‌ ఒప్పందం

క్లీన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాల్లో అంకుర పరిశ్రమలకు ఆహ్వానం..

త్వరలో గ్లోబల్‌ బ్రిడ్జి ప్రోగ్రాం నిర్వహణ

సాక్షి, సిటీబ్యూరో: అంకుర పరిశ్రమల స్వర్గధామం.. గ్రేటర్‌కు మణిహారమైన ‘టీ–హబ్‌’ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. కెనడాకు చెందిన ప్రతిష్ఠాత్మక కెనడా డిజిటల్‌ మీడియా నెట్‌వర్క్‌ (పబ్లిక్‌–ప్రైవేట్‌ ఇన్నోవేషన్‌ హబ్‌)తో టీ–హబ్‌ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నగరంలో ఇక కెనడా ‘క్లీన్‌టెక్నాలజీ’అందుబాటులోకి రానుంది. ప్రధానంగా కాలుష్య ఆనవాళ్లు లేకుండా వివిధ రకాల పరిశ్రమల్లో ఉత్పత్తుల పెంపునకు ఈ క్లీన్‌ టెక్నాలజీ దోహదం చేయనుంది. మరోవైపు  బయో టెక్నాలజీ, హెల్త్‌కేర్, సాఫ్ట్‌వేర్, బిజినెస్‌ టు బిజినెస్‌ తదితర రంగాల్లో ఆధునిక సాంకేతికత రానుంది. దీని ఆధారంగా మెరుగైన ఉత్పత్తులు, లక్ష్యాలు, సేవలను పొందడమే ధ్యేయంగా కెనడా అంకుర పరిశ్రమలకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. ఈ ఒప్పందంపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో సమక్షంలో ఇటీవల టీ–హబ్‌– డిజిటల్‌ మీడియా నెట్‌వర్క్‌ సంస్థల మధ్య సంతకాలు జరిగినట్లు టీ హబ్‌ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.

కెనడా అంకుర పరిశ్రమలకు ఆహ్వానం
బయో టెక్నాలజీ, క్లీన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ టు బిజినెస్‌ తదితర రంగాల్లో కెనడాలో విశేషంగా కృషి చేస్తున్న అంకుర పరిశ్రమలను మన నగరానికి ఆహ్వానించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కెనడియన్‌ డిజిటల్‌ మీడియా నెట్‌వర్క్‌(సీడీఎంఎన్‌)కు అనుబంధంగా పనిచేస్తున్న 26 సంస్థలను టీ– హబ్‌ ఆధ్వర్యంలో త్వరలో జరిగే బ్రిడ్జి ప్రోగ్రాంకు ఆహ్వానించినట్లు టీహబ్‌ ప్రతినిధులు తెలిపారు. ఇందుకోసం ఇటీవలే ఆసక్తిగల కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 15 వరకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా రంగాల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, ఉత్పత్తుల సాధనే లక్ష్యంగా పనిచేసే సంస్థలకు మన దేశంలో మార్కెట్‌ అవకాశాలను చూపడంతో పాటు ఇక్కడి పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీహబ్‌ సీఈఓ జేజే కృష్ణన్‌ తెలిపారు. కెనడా నుంచి మెరుగైన సాంకేతికతను పొందడంతో పాటు ఇక్కడి చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహంకల్పించడం, నూతన అంకుర పరిశ్రమలకు జీవం పోయడమే తమ ధ్యేయమన్నారు. ప్రధానంగా నిలకడగల అభివృద్ధి సాధన, హెల్త్‌కేర్‌ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. నూతన అంకుర పరిశ్రమల రాకతో ఉద్యోగవకాశాలు పెరగుతాయని, ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతుందన్నారు. 

కెనడా కంపెనీల ఎంపిక ఇలా..
టీ–హబ్‌లో అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్న కంపెనీలను.. వారి ప్రతిభ, గతంలో చేపట్టిన ప్రాజెక్టుల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన కంపెనీలకు గచ్చిబౌలిలోని టీ–హబ్‌ క్యాటలిస్ట్‌ భవనంలో 75 రోజుల పాటు వర్చువల్‌ శిక్షణ ఇస్తారు. మరో మూడు వారాలు దేశంలో ఆయా రంగాల్లో ఉన్న మార్కెట్‌ అవకాశాలు, వాణిజ్య అంశాలపై అవగాహన కల్పిస్తారు. దేశంలోని పలు నగరాల్లో మార్కెట్‌ మీటింగ్స్‌ను సైతం నిర్వహిస్తారు. 

టీ–హబ్‌ చరిత్ర ఇదీ..  
తెలంగాణా ప్రభుత్వం 2015లో టీ–హబ్‌ను ఏర్పాటు చేసింది. అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకున్న నిపుణులను, కార్పొరేట్‌ కంపెనీలను, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నూతన ఆవిష్కరణలను సాకారం చేయడం దీని లక్ష్యం. అంతేగాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సైతం పెంచనున్నారు. ఇప్పటికే ఈ హబ్‌లో దేశ, విదేశాలకు చెందిన 350 అంకుర పరిశ్రమలు పురుడు పోసుకున్నాయి. స్టార్టప్‌ కంపెనీలు పెట్టాలనుకునే నిపుణులకు టీ–హబ్‌ దిక్సూచీగా మారిందని నాస్‌కామ్‌ తాజా నివేదికలో పేర్కొనడం విశేషం. 

మరిన్ని వార్తలు