మార్చి నాటికి టీ హబ్‌–2!

15 Jan, 2020 08:06 IST|Sakshi
రాయదుర్గంలో రూపుదిద్దుకుంటున్న టీహబ్‌ –2 వ దశ భవనం నమూనా చిత్రం

సాక్షి, సిటీబ్యూరో: స్టార్టప్‌లకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో టీహబ్‌– 2వ దశ భవనం ఈ ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. దేశంలో అతిపెద్ద స్టార్టప్‌ల ల్యాబ్‌ (ఇంక్యుబేటర్‌)ఇదేనని ఐటీశాఖ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 9 అంతస్తులు..3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈభవనం రూపుదిద్దుకుంటోంది.  ఏకంగా వెయ్యి స్టార్టప్‌ కంపెనీలకు ఈ భవనం నిలయం కానుంది. సుమారు నాలుగువేల మంది సాంకేతిక నిపుణులు తమ సృజనకు పదునుపెట్టే వేదికగా ఈ భవనాన్ని రాయదుర్గంలో ఇంచుమించు మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో ఐటీశాఖ నిర్మిస్తోంది.

అత్యాధునిక హంగులతో
దుబాయ్‌లోని బుర్జ్‌ దుబాయ్‌ నిర్మాణ శైలిని పోలిన రీతిలో మరో అధునాతన భవంతి నిర్మాణం జరుగుతోంది. బయటి నుంచి చూసే వారికి ప్రధాన కేంద్రం నుంచి నాలుగు పిల్లర్లు.. వేలాడే రెండు స్టీలు దూలాలతో ఈ భవనం నిర్మించినట్లు..వేలాడే భవంతిలా కనిపించనుంది.  సుమారు 9 అంతస్తుల్లో ..60 మీటర్ల ఎత్తు...90 మీటర్ల పొడవున నిర్మిస్తోన్న ఈ భవన నిర్మాణం పనులు వడివడిగా జరుగుతున్నాయి. రెండులక్షల చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం...మరో మూడు లక్షల అడుగులమేర సువిశాలమైన పార్కింగ్‌ సదుపాయంతో సుమారు రూ.276 కోట్ల అంచనావ్యయంతో ఈ భవన నిర్మాణ పనులను చేపట్టారు.  గత ఆరునెలలుగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో అంకురపరిశ్రమలతోపాటు,ఇంక్యుబేషన్‌ల్యాబ్‌..ఉపాధికల్పన వంటి అంశాల్లో నాలుగు వేల మంది పనిచేసేందుకు వీలుగా విశాలమైన అంతస్తులను నిర్మించనున్నారు.

పిల్లర్లపై వండర్‌ బిల్డింగ్‌..
టీహబ్‌ రెండోదశ భవంతి అత్యాధునిక ఇంజినీరింగ్‌ డిజైన్లు,సాంకేతికత ఆధారంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ శైలి ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఈ భవన నిర్మాణంలో నాలుగు పిలర్ల ఆధారంగా ఒక పునాది..గ్రౌండ్‌ఫ్లోర్‌..దానిపై 9 అంతస్తుల మేర స్టీలు భవంతిని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో 9 వేల మెట్రిక్‌టన్నుల స్ట్రక్చరల్‌ స్టీల్, మరో 2500 టన్నుల రీఇన్‌ఫోర్స్‌ స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో కాంక్రీటు నిర్మాణం 25 వేల క్యూబిక్‌ మీటర్లు కావడం విశేషం. నిర్మాణం సమయంలో పునాదిని 6500 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీటు నిర్మాణాన్ని 26 గంటల సమయంలో పూర్తిచేయడం ఇంజినీరింగ్‌ రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ నిర్మాణ పనుల్లో 25 మంది నిపుణులైన ఇంజినీర్లు..200 మంది నైపుణ్యంగల కార్మికులు పాల్గొంటున్నారు.

ఒక్కో అంతస్తుకు ఓ ప్రత్యేకత...
గ్రౌండ్‌ఫ్లోర్‌: వీక్షకులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంటుంది. చక్కటి ఆహ్లాదకరమైన ఆకుపచ్చని గోడలు, ప్రకృతి రమణీయ హరిత దృశ్యాలు, ప్రవేశ ద్వారం, ఆరుబయట సేదదీరేందుకు విశాలమైన పచ్చికబయలు, తగిన సౌకర్యాల కల్పన ఈ ఫ్లోర్‌ సొంతం.

మొదటి అంతస్తు: విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టే నిర్మాణ శైలి, ఇంక్యుబేషన్‌ కేంద్రం దీని ప్రత్యేకత. భవనంలో జరిగే మొత్తం రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది.

రెండో అంతస్తు: అద్భుతమైన 3డి చిత్రాలతో ఆలోచనలను ఆవిష్కరింపజేసే ప్రయోగస్థలాన్ని తలపిస్తుంది. సమావేశమందిరాలు,చర్చా ప్రాంగణాలు ఇందులో ఉంటాయి.

3,4వ అంతస్తులు: అంకురపరిశ్రమలు, ఐటీ, బీపీఓ, కెపిఓ,సేవారంగానికి చెందిన వివిధ కార్యాలయాల ఏర్పాటు, సమావేశాలు, చర్చల నిర్వహణకు అవసరమైన హంగులుంటాయి. ఆకుపచ్చని మొక్కలు, హరితతోరణంతో ఆరోగ్యకరమైన, వినూత్న ఆలోచనలు..వాటి ఆచరణలో పెట్టేందుకు అనువైన పరిస్థితులుంటాయి.

5వ అంతస్తు: ప్రశాంతతకు చిహ్నంగా నిలిచే అటవీ ప్రాంతాన్ని తలపించేలా ఉంటుంది. చిన్నచిన్న కాలిబాటలు..నీటి సెలయేర్లు..అభిప్రాయాలు, ఆలోచనలు పరస్పరం పంచుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటుచేస్తారు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవనుందీ అంతస్తు.

6,7,8,9వ అంతస్తులు: వివిధ రకాల కార్యాలయాలు,అంకురపరిశ్రమలు ఏర్పాటుచేసుకోవచ్చు. ఉద్యోగులకు ఆనందాన్ని,ఆహ్లాదాన్ని,ఆరోగ్యాన్ని పంచేందుకు అవసరమైన వసతులుంటాయి. ఉద్యోగులకు ఆటవిడుపు.. ఇన్‌డోర్‌గేమ్స్, జిమ్‌లు, క్యాంటీన్‌లు, ఫుడ్‌ కోర్టులు, కేఫెటేరియాలు ఇందులో ఉంటాయి.

3డి నిర్మాణ శైలి..  
ఈ భవన నిర్మాణంలో చేపట్టిన వినూత్న విధానాలు, ఆధునిక ఇంజినీరింగ్‌ ప్రమాణాలు, ప్రపంచంలోకెల్లా అత్యున్నత మైనవి కావడంతో ఈ భవనాన్ని 3డి నిర్మాణంగా భావిస్తున్నారు. ఈ భవన రూపకల్పన, నిర్మాణ విశ్లేషణను ‘ఈటీఏబీఎస్‌ వి 15.2.2’ అనే నూతన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం ద్వారా రూపొందించారు. నిర్మాణ ప్రమాణాల విషయానికి వస్తే ఐఎస్‌ 456–2000 ప్రమాణాల ప్రకారం బీమ్‌లు, ఆర్‌సీసీ గోడలు, స్తంభాలను రూపకల్పన చేశారు. భూకంపాలను తట్టుకునేస్థాయిలో ఐఎస్‌ 1893–2002 ప్రమాణాల ప్రకారం నిర్మించారు. ఈ స్టీలు భవంతి భూకంపాలు, వరదలకు సైతం చెక్కుచెదరని సాంకేతికతతో నిర్మిస్తున్నారు. గురుత్వాకర్షణ బలాలను సైతం ఈ భవంతి తట్టుకుంటుంది. అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనుండడం విశేషం.

మరిన్ని వార్తలు