'కడిగిన ముత్యంలా బయటపడతా'

29 Jan, 2015 03:02 IST|Sakshi
'కడిగిన ముత్యంలా బయటపడతా'
  • ఆందోళన వద్దని అభిమానులకు రాజయ్య విజ్ఞప్తి
  • హైదరాబాద్: ఉద్యమంలో మంచి భూమిక పోషించానని, ఆరోపణల నేపథ్యంలో ఇక సామాన్య కార్యకర్తగా ముందుకు సాగుతానని తాజా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన రాజయ్య గుండెపోటుతో మంగళవారం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మలిదఫా వైద్య పరీక్షల నిమిత్తం హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి  బుధవారం వచ్చిన రాజయ్య వైద్యపరీక్షల అనంతరం మీడియాతో మాట్లాడారు.

    ‘నాడు తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చా, నేడు బంగారు తెలంగాణ కోసం ద్వితీయ స్థానాన్ని త్యజించా, తండ్రిలాంటి సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నాను.’ అని అన్నారు. ఆరోపణలపై పారదర్శకంగా విచారణ జరగాలన్నారు. విచారణ తర్వాత కడిగిన ముత్యంలా బయటపడతానన్నారు. కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కోరారు.

    రాజయ్యను పరామర్శించేందుకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ అవినీతికి తావులేని పాలన కొనసాగుతుందని సీఎం చెపుతూనే ఉన్నారని, ఈ నేపథ్యంలో రాజయ్యపై ఆరోపణలు వచ్చినందున విచారణ కోసం తప్పించి ఉంటారని అభిప్రాయపడ్డారు. రాజయ్య తొలగింపు కక్షపూరితం కాదని, బర్తరఫ్ చేశారంటూ దళితులను తప్పుదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు