ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘టీ ట్రైబ్‌’

31 May, 2020 08:34 IST|Sakshi

ఏడు రాష్ట్రాలకు చెందిన వర్సిటీలతో ‘టీ–హబ్‌’భాగస్వామ్యం

విద్యా సంస్థల్లో ‘ఈ సెల్స్‌’ఏర్పాటు

లాంచ్‌పాడ్‌ ద్వారా విద్యాసంస్థలు, మాస్టర్‌క్లాస్‌ ద్వారా విద్యార్థులకు శిక్షణ

సాక్షి, హైదరాబాద్‌: ఔత్సాహిక స్టార్టప్‌లు, స్టూడెంట్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా విద్యా సంస్థలను భాగస్వాములుగా చేస్తూ ‘టీ–ట్రైబ్‌’అనే కొత్త కార్యక్రమాన్ని స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ ‘టీ–హబ్‌’ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా లాంచ్‌పాడ్, మాస్టర్‌ క్లాస్‌ అనే కేటగిరీల్లో ఔత్సాహిక స్టార్టప్‌లతో పాటు విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు ‘టీ–ట్రైబ్‌’సహకారం అందిస్తుంది.

ఇంక్యుబేషన్‌ లేదా ‘ఈ సెల్స్‌’కలిగి ఉన్న విద్యా సంస్థలకు లాంచ్‌పాడ్‌ ఏడాది పాటు ఎంట్రప్రెన్యూర్‌ వేదికగా పనిచేస్తుంది. ఇంక్యుబేషన్‌ ప్రోగ్రామ్‌ను ఎలా నిర్వహించాలనే అంశంపై విద్యా సంస్థలకు లాంచ్‌పాడ్‌ సహకారం అందిస్తుంది.వినూత్నం, ఆచరణ సాధ్యమైన స్టార్టప్‌లకు చెందిన ఆలోచనలు కలిగిన విద్యార్థులకు మాస్టర్‌ క్లాస్‌ ద్వారా మెళకువలు నేర్పిస్తారు.జూన్‌ నుంచి టీ ట్రైబ్‌ కార్యక్రమం ప్రారంభం కానుండగా తొలి బ్యాచ్‌కు జూన్‌ నుంచి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ‘టీ–ట్రైబ్‌’పై ఆసక్తికలిగిన విద్యా సంస్థలు, విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఇప్పటికే ‘టీ–హబ్‌’నోటిఫికేషన్‌ విడుదల చేసింది. చదవండి: సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి

విద్యా సంస్థలతో భాగస్వామ్యం
‘టీ–ట్రైబ్‌’కోసం ఏడు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో పాటు, ఈ విద్యా సంస్థల సహకారంతో ‘టీ–ట్రైబ్‌’శాటిలైట్‌ సెంటర్లను ‘టీ–హబ్‌’ఏర్పాటు చేసింది. ‘టీ–ట్రైబ్‌’లోని మాస్టర్‌క్లాస్‌లో చేరే విద్యా సంస్థలకు అవసరమైన శిక్షణ, కార్యశాలలు, వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని శాటిలైట్‌ సెంటర్ల ద్వారా ‘టీ–హబ్‌’అందిస్తుంది. ఈ సెల్స్‌ను కలిగిన విద్యా సంస్థలు, స్టూడెంట్‌ ఎంట్రప్రెన్యూర్స్‌కు ఎదురయ్యే సమస్యలకు అవసరమైన పరిష్కారాలను అందించడంతో పాటు, త్వరితగతిన తమ ఆలోచనలకు పదును పెట్టుకునేందుకు సహకరిస్తుంది.

దేశ విదేశాల్లోని ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్‌ ప్రమాణాలకు అనుగుణంగా ‘టీ–ట్రైబ్‌’లో చేరే విద్యా సంస్థలు, విద్యార్థులు రాణించేందుకు అవసరమైన సాధన సంపత్తిని ‘టీ–హబ్‌’అందజేస్తుంది. కరోనా మూలంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విద్యా సంస్థలు, విద్యార్థులను సరికొత్త ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ‘టీ–ట్రైబ్‌’లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ‘టీ–హబ్‌’వర్గాలు వెల్లడించాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా