హీమోఫీలియా మందుల్లేవ్‌!

8 Jan, 2019 09:38 IST|Sakshi

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో దొరకని వైనం  

‘గాంధీ’లో మూడు నెలలుగా అందని మందులు

నిధులున్నా కొనుగోలు చేయని అధికారులు  ఆందోళనలో బాధితులు  

సాక్షి,సిటీబ్యూరో: జన్యుసంబంధమైన హీమోఫీలియా(రక్తస్త్రావం) బాధితులకు మందులు దొరకడం లేదు. తెలంగాణలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా మందులు దొరకడం లేదు. ఎప్పటికప్పుడు మందులు కొనుగోలు చేసి రోగులకు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రతిష్టాత్మక గాంధీ జనరల్‌ ఆస్పత్రిలో గత మూడు నెలలుగా మందులు లేకపోవడంతో రక్తస్త్రావం సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకుంటున్న రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. మందుల కోనుగోలు కోసం జాతీయ ఆరోగ్య మిషన్‌ ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించినప్పటికీ, వాటిని ఉపయోగించి మందులు కొనుగోలు చేసి ఆయా ఆస్పత్రులకు పంపించడంలో తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో రక్తం గడ్డకట్టక తీవ్రస్త్రావంతో బాధితులు మృత్యువుతో పోరాడుతున్నారు. 

బాధితుల ఎదురుచూపు....  
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 900 మంది హీమోఫీలియా బాధితులు ఉన్నారు. హీమోఫీలియా బాధితులను ఫ్యాక్టర్‌–7, ఫ్యాక్టర్‌–8, ఫ్యాక్టర్‌–9గా విభజించారు. ఏదైనా ప్రమాదంలో గాయపడి తీవ్ర రక్తస్త్రావం అవుతున్నప్పుడు, ముక్కు, ఇతర అవయవాల నుంచి రక్తస్త్రావం అవుతున్నప్పుడు వెంటనే యాంటి హీమోఫీలియా ఇంజక్షన్‌ చేయాల్సి ఉంటుంది. రోగి వయసు, బరువును బట్టి మందు ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెట్లో వాయిల్‌ ధర రూ.6,500 ఉంది. 35 ఏళ్ల వయసు ఉండి, 70 కేజీల బరువున్న వ్యక్తికి ఒకే రోజు సుమారు మూడు వాయిల్స్‌ అవసరం అవుతుంటాయి. మందులు, వైద్య పరీక్షల కోసం ఉన్నదంతా ఖర్చు చేసిన నిరుపేద బాధితులకు వీటి ఖరీదు మరింత భారంగా మారింది. హీమోఫీలియా సొసైటీ అభ్యర్థన మేరకు ప్రభుత్వం బాధితులకు ఉచితంగా మందులు అందజేసేందుకు అంగీకరించింది. ఇదే సమయంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఇందుకు రూ.4.85 కోట్లు కూడా మంజూరు చేసింది.

తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ఈ మందులను కొనుగోలు చేసి ఉస్మానియా, గాంధీ సహా జిల్లా ఆస్పత్రులకు సరఫరా చేయాలని భావించింది. ఆ మేరకు 2016 నుంచి ఇప్పటి వరకు ఆయా మందుల కోసం రూ.2కోట్లకు పైగా ఖర్చు చేసి ఉస్మానియా, మహబూబ్‌నగర్‌ ఆస్పత్రులకు పంపిణీ చేశారు. మరో రూ.1.85 కోట్ల వరకు నిధులు ఉన్నాయి. వీటిని గాంధీ ఆస్పత్రికి కేటాయించకపోవడంతో ఇప్పటి వరకు మందులకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులు వెచ్చించాల్సి వచ్చింది. గత మూడు మాసాలుగా ఆస్పత్రి అధికారులు వీటి కొనుగోలును నిలిపివేశారు. అదేమంటే హీమోఫీలియా మందులకు ఆస్పత్రికి ఎలాంటి బడ్జెట్‌ కేటాయించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో తాము మాత్రం ఎక్కడి నుంచి కొనుగోలు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మందులకు బడ్జెట్‌ కేటాయిస్తే గానీ రోగులకు అందించలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో రక్తం గడ్డకట్టక రక్తస్త్రావంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రులకు చేరుకుంటున్న రోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

వెంటనే సరఫరా చేయాలి...  
ఉస్మానియా, గాంధీలో మాత్రమే కాదు తెలంగాణలోని ఏ జిల్లా ఆస్పత్రిలోనూ హీమోఫీలియా మందుల్లేవు. జిల్లా ఆస్పత్రుల్లో ఒకటి రెండు మిగిలి ఉన్నా ఇటీవల వాటిని కూడా వాడేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మందుల కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎన్‌హెచ్‌ఎం మంజూరు చేసిన నిధులు ఇంకా మిగిలే ఉన్నప్పటికీ, వాటిని ఉపయోగించి మందులు కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అసలే నిరుపేదలు, ఆపై భయంకరమైన జన్యుసంబంధ జబ్బుతో బాధపడుతున్న వారికి మందులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే మందులు కొనుగోలు చేసి బాధితులకు అందజేయాలి.  – రామారావు, హీమోఫీలియాసొసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు