-

విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు

6 Nov, 2019 03:25 IST|Sakshi
విజయారెడ్డి మృతదేహం ముందు రోదిస్తున్న బంధువులు

శోకసంద్రమైన అంతిమయాత్ర

భారీగా తరలివచ్చిన బంధుమిత్రులు, ఉద్యోగులు

సీబీఐ విచారణకు రాజకీయ పార్టీల డిమాండ్‌  

దిల్‌సుఖ్‌నగర్‌/నాగోలు/మన్సూరాబాద్‌: తహసీల్దార్‌ విజయారెడ్డి అంతిమయాత్ర శోకసంద్రమైంది. మంగళవారం ఆర్‌కేపురం వాసవి కాలనీ లక్ష్మీ అపార్ట్‌మెంట్‌ నుంచి నాగోల్‌లోని శ్మశాన వాటిక వరకు ఐదు గంటలపాటు సాగిన అంతిమయాత్రలో దారి పొడవునా కన్నీటి నిరసనలు కనబడ్డాయి. పోలీసుల బందోబస్తు మధ్య అంతిమయాత్రలో భారీ సంఖ్యలో బంధువులు, రెవెన్యూ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయారెడ్డికి నివాళులర్పించారు. విజయారెడ్డి కుమారుడు భువనసాయి, కుమార్తె చైత్ర ఉన్నా చిన్నవాళ్లు కావడంతో భర్త సుభా‹Ùరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ దగ్గరుండి అంత్యక్రియలు ముగిసే వరకు పర్యవేక్షించారు. విజయారెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నాగోలు శ్మశాన వాటికలో నిర్వహించారు. 

రాస్తారోకో... స్వల్ప ఉద్రిక్తత... 
అల్కాపురి చౌరస్తాలో రెవెన్యూ ఉద్యోగులు మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. విజయారెడ్డి మృతదేహంతో ఒక్కసారిగా రెవెన్యూ ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చి రాస్తారోకో నిర్వహించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కమిషనర్‌ మహేశ్‌ భగవత్, జాయింట్‌ సీపీ సురేందర్‌బాబు, ఇతర పోలీస్‌ అధికారులు రెవెన్యూ ఉద్యోగులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.  

విజయారెడ్డికి గౌరవ వందనంగా తుపాకులను గాలిలోకి కాలుస్తున్న చేస్తున్న పోలీసులు  

ఉదయం ఏడు గంటల నుంచే... 
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రెవెన్యూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పారీ్టల నేతలు మంగళవారం ఉదయం 7 గంటలకే విజయారెడ్డి నివాసానికి చేరుకొని అమె మృతదేహానికి నివాళులర్పించారు. ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయారెడ్డి అంతిమ యాత్రలో భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, జిట్టా బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. 

సీబీఐతో విచారణ జరిపించాలి: రేవంత్‌
విజయారెడ్డి సజీవదహనం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మేజి్రస్టేట్‌ అధికారాలున్న అధికారిపై దాడి చేయడం దారుణమని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయని మండిపడ్డారు. 

రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి...  
విజయారెడ్డి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉద్యోగులకు భద్రత కలి్పంచాలని కోరారు. విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందని, దీన్ని తేల్చాల్సిన అవసరముందని అన్నారు.  

అండగా ఉంటాం: మేడ్చల్‌ కలెక్టర్‌ ఎంవీ రెడ్డి
విజయారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇది ఉన్మాదంతో ఒక వ్యక్తి చేసిన పని. ఇలాంటి ఘటన ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్‌లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఉన్నచోట్ల ప్రత్యేక చర్యలు చేపడతాం. 

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి: లచ్చిరెడ్డి  
విజయారెడ్డి హత్యపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ తహసీల్దార్ల వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి డిమాండ్‌ చేశారు. 3 రోజులు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. త్వరలోనే పూర్తి కార్యాచరణ విడుదల చేస్తామని అన్నారు.  

విజయారెడ్డి కుటుంబానికి అండగా ఉందాం : రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ 
సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి అమానుష హత్యను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఖండించారు. మృతురాలి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి ఘటన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి భద్రత కలి్పంచేలా వెంటనే చర్యలు చేపట్టాలని సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లాల కలెక్టర్లకు సందేశం పంపారు. కాగా,తహసీల్దారు సజీవ దహనంపై తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం (టీఎస్‌ఐఏఎస్‌) ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రభుత్వం విజయారెడ్డి కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరింది. ప్రజాసేవలో అధికారులు ధైర్యంగా పనిచేయాలంటే నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించింది.  

అఖిలపక్షం నిర్వహించాలి: చాడ 
సాక్షి, హైదరాబాద్‌: తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం ఘటన నేపథ్యంలోనైనా వెంటనే రెవెన్యూ నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో భేటీ ఏర్పాటు చేసి రెవెన్యూ చట్టాలు, భూరికార్డుల్లో మార్పులకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జాప్యం జరిగే కొద్దీ ఉద్యోగులు, ప్రజల మధ్య అంతరాలు పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని, ఇది సమాజానికి మంచిదికాదని మంగళవారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
 
నేడు నల్లబ్యాడ్జీలతో నిరసనలు 
సాక్షి, హైదరాబాద్‌: తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిస్తూ, రెవెన్యూ ఉద్యోగులకు సంఘీభావంగా బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్టు అటవీశాఖలోని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. మంగళవారం అరణ్యభవన్‌లో జరిగిన సమావేశంలో స్టేట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్స్, మినిస్టీరియల్‌ స్టాఫ్, డ్రైవర్లు, క్లాస్‌–4 ఉద్యోగుల సంఘాలు తహసీల్దార్‌ విజయారెడ్డి మృతికి సంతాపం తెలిపాయి. 

విధుల బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకు నిరసనగా మంగళవారం రెవెన్యూ, ఇతర ఉద్యోగ సంఘాలు విధులు బహిష్కరించాయి. విధి నిర్వహణలో అసువులుబాసిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. 

ఒక్కడి పనేనా? 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తహసీల్దార్‌పై పథకం ప్రకారం పెట్రోల్‌ పోసి సజీవదహనం చేసిన నిందితుడు కూర సురేశ్‌ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? హత్యకు కుట్రను అతను ఎవరితోనైనా పంచుకున్నాడా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సురేశ్‌ మొబైల్‌ కాల్‌డేటాను విశ్లేషిస్తున్నారు. హత్యకు ముందు సురేశ్‌ తన పెదనాన్న దుర్గయ్యతోపాటు పలువురు బంధువులు, స్నేహితులతో మాట్లాడినట్లు గుర్తించారు. మరోవైపు ఈ వ్యవహారంలో సురేశ్‌ పెదనాన్న దుర్గయ్య పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేశ్‌కు ఎలాంటి మానసిక రుగ్మతల్లేవని గ్రామస్తులంతా చెబుతుంటే దుర్గయ్య, కుటుంబ సభ్యులు మాత్రం అతనికి మతిస్థిమితం లేదని, రియల్టర్‌ అని, వివాదంతో సంబంధమే లేదని పొంతనలేని సమాధానాలు చెప్పడం వెనుక దురుద్దేశం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సురేశ్‌ కుటుంబానికి 1998లోనే ఆర్‌.ఓ.ఆర్‌ కింద పాసు పుస్తకాలు మంజూరయ్యాయని స్థానికులు చెబుతుండటంతో ఈ వ్యవహారంతో సురేశ్‌కు సంబంధం లేదని కుటుంబ సభ్యులు చెప్పడంపై సందేహపడుతున్నారు. సురేశ్‌ వెనక బంధువులు ఎవరైనా ఉన్నారా? అనే విషయంపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు