రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళాలకు చర్యలు

25 May, 2019 02:03 IST|Sakshi

విత్తనమేళా–2019ను ప్రారంభించిన వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల్లోనూ విత్తనమేళాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాయలం ఆడిటోరియం ఆవరణలో శుక్రవారం ‘‘విత్తనమేళా–2019’’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికే తలమానికంగా ఉండేలా సీఎం కేసీఆర్‌ రైతులకి విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుల రుణమాఫీ, మిషన్‌ కాకతీయ, విత్తన సరఫరా, మార్కెట్ల ఆధునీకరణ వంటి ఎన్నో పథకాల్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.

కేసీఆర్‌ ప్రతి ఎకరానికి నీరు అందివ్వాలనే ఉద్దేశ్యంతో కాళేశ్వరం, పాలమూరు వంటి ప్రాజెక్టుల్ని చేపట్టారన్నారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ పూర్తయిన వెంటనే ఈ నెల 27 తర్వాత రుణమాఫీ అమలు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో తెలంగాణలో కోట్లాది మందికి వ్యవసాయం ద్వారానే ఉపాధి కల్పించే విధంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. యువత కూడా వ్యవసాయం వైపు పెద్దసంఖ్యలో ఆకర్షితులయ్యేలా ప్రణాళికలు అమలు చేస్తామన్నారు.

ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు సంప్రదింపులు అందించేందుకు కొత్త ‘యాప్‌’లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన నాణ్యత ప్రమాణాలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తులని పండించేలా తెలంగాణ రైతులు అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. వ్యవసాయానికి సంబంధించి కొత్త కార్యక్రమాల్ని రూపొందిస్తూ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్న వ్యవసాయవర్సిటీ వీసీ డా.వి. ప్రవీణ్‌రావును ఇదే పదవిలో మరో మూడేళ్లపాటు కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా, వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డా.వి.ప్రవీణ్‌రావు, పరిశోధనా సంచాలకులు డా.జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు