కోటి తలంబ్రాల సేద్యానికి శ్రీకారం

13 Jul, 2018 02:48 IST|Sakshi

ప్రత్యేక పూజలతో సాగు ప్రారంభం

భద్రాచలం: ఏటా శ్రీరామనవమి రోజున గోటితో వలిచిన కోటి తలంబ్రాలను తూర్పు గోదావరి జిల్లా నుంచి భద్రాచలం తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో వచ్చే శ్రీరామనవమికి తీసుకొచ్చే వరి ధాన్యాన్ని పండించేందుకు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గురువారం పనులకు శ్రీకారం చుట్టా రు.

సీతారామచంద్రస్వామికి, ఒంటిమిట్ట కోదండరామయ్యకు ఎనిమిదో సారి గోటి తలంబ్రాలను సమర్పించేందుకు వరి విత్తనాలకు ఇటీవలే భద్రాద్రి రామయ్య సన్నిధిలో పూజలు జరిపామని సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు తెలిపారు. ఆ విత్తనాలను గోకవరంలోని తమ భూమిలో పండిస్తామన్నారు.

పూజ చేసిన విత్తనాలను పొలంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర శతనామ పూజలు చేశారు. వానర వేషధారణతో ఉన్న శ్రీరామ భక్తులు అరక దున్ని, విత్తనాలనుచల్లి ఆకుమడి తయారు చేశారు. ఇలా తలంబ్రాల వరకు అంతా రామమయం అనే భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అప్పారావు తెలిపారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసేలా రైతులను చైతన్యం చేయడానికి కోటి తలంబ్రాలు సాగు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

మరిన్ని వార్తలు