అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలే: తలసాని

31 Mar, 2020 02:41 IST|Sakshi

మటన్, చికెన్‌ విక్రయాలపై మంత్రి హెచ్చరిక

మాంసం ఉత్పత్తుల సరఫరాకు జిల్లాస్థాయి నోడల్‌ అధికారులు

గొర్రెలు, మేకలు అమ్ముకునేందుకు అనుమతులిప్పిస్తాం.. చేపల విక్రయాలకు కూడా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల వుతున్న నేపథ్యంలో మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. మాంసం, కోడిగుడ్లు, చేపలను సక్రమంగా సరఫరా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, ఇందుకోసం పశుసంవర్ధక, మత్స్య శాఖ, పోలీసు, రవాణా శాఖల అధికారులతో కలిపి జిల్లా స్థాయిలో నోడల్‌ అధికారులను నియమిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. ఈనెల 29న ఆదివారం వివిధ మార్కెట్‌లలో మాంసం, చికెన్, చేపలు సరిగా అందుబాటులో లేవని, ఉన్న మాంసాన్ని అధిక ధరలకు విక్రయించారనే ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలో మాంసం, చికెన్, చేపల లభ్యత, సరఫరాపై పశుసంవర్ధక శాఖ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన అత్యవసర సమీక్ష జరిపారు.

ఈ సమావేశానికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్‌ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, అడిషనల్‌ డైరెక్టర్‌ రాంచందర్, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ వెటర్నరీ ఆఫీసర్‌ అబ్దుల్‌ వకిల్, పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హర్షవర్ధన్, స్నేహ చికెన్‌ అధినేత రాంరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గొర్రెలు, మేకల సరఫరా లేని కారణంగా మాంసం ధరలు పెరిగాయని చెప్పారు. గొర్రెలు, మేకల సరఫరాకు, విక్రయాలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మాంసం ధరలను నియంత్రిస్తామని, ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికావద్దని హామీ ఇచ్చారు.

ప్రత్యేక అనుమతులు ఇస్తాం
గొర్రెలు, మేకలను జంట నగరాలకు కానీ, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాలకు కానీ తీసుకెళ్లి విక్రయించుకునేందుకు అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. గొర్రెలు, మేకలను తరలించే వాహనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ అన్ని జిల్లాల ఎస్పీలు, రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాయాలని పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రను మంత్రి ఆదేశించారు. మటన్‌ విక్రయ దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గోశాలల్లో ఉన్న జీవాలకు పశుగ్రాసం కొరత ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే గోశాలల నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అధికారులను మంత్రి కోరారు. వివిధ నీటి వనరులలో సైజుకు వచ్చిన చేపలను పట్టుకుని మత్స్యకారులు విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణను ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన చేపల వ్యాపారులు ఎవరైనా ఇతర జిల్లాలకు వెళ్లి చేపలు తీసుకొచ్చి విక్రయించుకోవాలనుకుంటే వారికి కూడా అవసరమైన అనుమతులు ఇస్తామని, చికెన్‌ దుకాణాల్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు