చేప ప్రసాదం కోసం వచ్చే వారికి రవాణా, భోజన సౌకర్యం

28 May, 2019 14:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చేప మందు ప్రసాదం కోసం వచ్చే వారికి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 173 ఏళ్ల నుంచి వంశపారంపర్యంగా బత్తిని హరనాథ్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చేపమందు ప్రసాదం కోసం మన రాష్ట్రం నుంచే కాక ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తారన్నారు.

వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకునేలా సీఎస్‌తో చర్చింమన్నారు. చేపమందు ప్రసాదం కోసం వచ్చేవారికి జీహెచ్‌ఎంసీ అధ్వర్యంలో రూ.5కే భోజన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ అధ్వర్యంలో రవాణా ఏర్పాట్లు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమానికి వచ్చే వారందరికి సరిపడా చేప పిల్లలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లు భేష్‌ : బత్తిని
ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేప మందు ప్రసాదం కార్యక్రమం కోసం అనేక ఏర్పాట్లు చేస్తోందన్నారు బత్తిని హరనాథ్‌ గౌడ్‌. 8వ తేదీ సాయంత్రం మొదలై 9వ తేదీ రాత్రి వరకూ చేప ప్రసాదం అందజేస్తామన్నారు. ఒక వేళ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్లో దొరక్కపోతే.. తమ నివాస గృహాల్లో.. వారి కుటుంబ సభ్యులు కూడా ప్రసాదం అందజేస్తారని తెలిపారు. చేప ప్రసాదం కోసం గత ఏడాది లానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలందరికి సరిపోయే విధంగా చేప ప్రసాదం తయారు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు