దిగ్విజయ్‌పై పరువు నష్టం దావా

3 Jun, 2017 03:31 IST|Sakshi
దిగ్విజయ్‌పై పరువు నష్టం దావా
- క్రిమినల్‌ కేసు పెడతా: మంత్రి తలసాని
- కుటుంబ పాలన మొదలైంది కాంగ్రెస్‌ నుంచే..
ఉద్యమం నుంచే కేటీఆర్, కవిత వచ్చారు
కుటుంబ పాలన అనడం తగదని హితవు
 
సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌లోని భూముల కబ్జాల విషయంలో తన ప్రమేయం ఉందంటూ ఆరోపించిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావాతోపాటు క్రిమినల్‌ కేసు పెట్టను న్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన సచివాలయం లో విలేకరులతో మాట్లాడుతూ.. పదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్లు కేంద్రమంత్రిగా పనిచేసి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దిగ్విజయ్‌ బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవుపలికారు. ఎవరో చోటామోటా నాయకుల మాటలు నమ్మి తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

25 ఏళ్ల నుంచి రాజకీ యాల్లో కొనసాగుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసినందుకు దిగ్విజయ్‌పై దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు. లాయర్ల ద్వారా ఆయనకు లీగల్‌ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. పరువు నష్టం దావాలో రూ.10 కోట్లు వస్తే ఏం చేస్తారని ఒక విలేకరి ప్రశ్నించగా ఏదో ఒక ట్రస్టుకు ఇస్తానని పేర్కొన్నారు. మంత్రి పదవిలో ఉన్న తనపై వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునేం దుకు తప్పుడు ఆరోపణలు గుప్పించడం దిగ్విజయ్‌ స్థాయికి తగదన్నారు. 
 
కాంగ్రెస్‌ నుంచే ప్రారంభం
రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై విలేకరుల ప్రశ్నకు తలసాని జవాబిస్తూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీనే కుటుంబ పాలనను ప్రారంభించిందని విమర్శించారు. పనిగట్టుకొని సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు చేయడం తగదన్నారు. కేసీఆర్‌ కుటుంబం అధికారంలోకి వచ్చాక పదవులు పొందలేదని, తెలంగాణ ఉద్యమంలోనే కేటీఆర్, కవిత పాల్గొన్న విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన భార్య ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేదా అని ప్రశ్నించారు. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు రాజకీయాల్లో, పదవుల్లో లేరా అని ప్రశ్నించారు.
మరిన్ని వార్తలు