బీసీలకు టీఆర్‌ఎస్‌ శ్రీరామరక్ష

29 Dec, 2018 01:43 IST|Sakshi

తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి తలసాని వ్యాఖ్యలు

హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు

చంద్రబాబు ఓడిపోయి ఇంటి బాట పట్టడం ఖాయం 

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారమే పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బీసీలకు శ్రీరామరక్షగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం తలసాని విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష పార్టీల నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీలు ఇప్పుడు గొంతు చించుకుంటున్నాయి.

బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించింది. బీసీలను ఉద్ధరించినట్లుగా కొందరు మాట్లాడుతున్నారు. బీసీలకు, సబ్బండ వర్గాలకు టీఆర్‌ఎస్‌ శ్రీరామరక్ష. టీఆర్‌ఎస్‌ రెండు రాజ్యసభ సీట్లను బీసీలకు కేటాయించింది. శాసనసభ, శాసనమండలి అధ్యక్ష పదవులను బీసీలకు ఇచ్చింది. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. ఆర్‌.కృష్ణయ్య ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి బీసీ నేత ముసుగులో టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారు. బీసీ సంఘాలకు కోట్లాది రూపాయల విలువైన భూములను కేటాయించిన ఘనత కేసీఆర్‌దే. కాంగ్రెస్, టీడీపీలు ఇక ఏ ఎన్నికలు జరిగినా నిండా మునగడం ఖాయం..’అని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబువి చిల్లర రాజకీయాలు.. 
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఫలితాలపై మాట్లాడకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయానికి తానే కారణమన్నట్టుగా చెప్పుకుంటున్నారని తలసాని విమర్శించారు. ‘చంద్రబాబు తిరిగిన సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ వస్తుందని ఎన్నికల ముందే చెప్పాను. అదే జరిగింది. చంద్రబాబువి చిల్లర రాజకీయాలు. దమ్ముంటే ఏపీలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలి. గత ఎన్నికల్లో చెప్పినట్టు బాబు ఇంటికో ఉద్యోగం ఇప్పించాలి. ఏపీ ప్రజలు హామీలపై బాబును నిలదీయాలి. బాలకృష్ణకు మాట్లాడటం చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి. ఏది పడితే అది మాట్లాడొద్దు. ఓ పెద్ద మనిషి తప్పుడు సర్వేతో ఏపీలో బెట్టింగ్‌తో కోట్లాది రూపాయలు కోల్పోయాడు. దీని వెనక బాబు కుట్ర ఉంది. నాలుగు నెలల తర్వాత చంద్రబాబు ఓడిపోయి ఇంటికి వెళ్లడం ఖాయం..’అని అన్నారు.  

మరిన్ని వార్తలు