త్వరలోనే షూటింగ్‌లకు అనుమతిస్తాం: తలసాని

28 May, 2020 17:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వీలైనంత త్వరగా సినిమా చిత్రీకరణకు అనుమతిస్తామ​ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కార్యాలయంలో సినీ ప్రముఖులతో గురువారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హీరో నాగార్జున, దర్శకులు ఎస్‌ఎస్‌ రాజమౌళి, త్రివిక్రమ్‌, కొరటాల శివ, డి. సురేష్‌బాబు, సుప్రియ, మా అధ్యక్షులు నరేష్‌, తదితరులు హాజరయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ల ప్రారంభంపై చర్చించామని, ఇందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దానిపై పలు సూచనలు చేసినట్లు వెల్లడించారు. (సినీరంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది)

ఎలాంటి ఇబ్బందులు లేవనే పోస్టు ప్రొడక్షన్స్‌కు అనుమతిచ్చామని, విధానపరమైన నిర్ణయాలను రూపొందించామని చెప్పారు. ఇక సినీ రంగం ప్రతినిధుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకుళ్తామని, ఆయన అమోదించగానే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న వారినే చర్చలకు పిలిచామని తెలిపారు. సమావేశాలకు అందరినీ పిలవబోమని, అసోషియేషన్‌ ప్రతినిధులను మాత్రమే పిలుస్తామన్నారు. బాలకృష్ణ మాట్లాడినట్టుగా చెబుతున్న వీడియో పాతది అంటున్నారని, దీనిపై క్లారిటీ వచ్చాక మాట్లాడతానని తలసాని చెప్పారు.

హీరో నాగార్జున మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తమ విషయంలో చాలా త్వరగా స్పందిస్తోందన్నారు. తలసాని వల్లే ఇదంతా సాధ్యమైందని నాగార్జున వ్యాఖ్యానించారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చిత్రీకరణలపై చర్చించామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాలేకపోవడంతో హోం సెక్రటరీ రవితో చర్చించామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. (సినీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం)

మరిన్ని వార్తలు