‘బలవంతంగా వినాయక నిమజ్జనం చేయడం లేదు’

10 Sep, 2019 17:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళుతున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం బుధవారం ఉదయం 12 గంటల వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌ను చేరుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి అవుతుందని తెలిపారు. కాగా మహాగణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యేలా హెచ్ఎండీఏ అధికారులు హుస్సేన్‌ సాగర్‌లో పూడిక తీశారని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారన్నారు. 

మొదటి రోజు నుంచి కూడా అధికారులు భక్తులకు, సందర్శకులకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, మేము బలవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం లేదు స్పష్టం చేశారు. ఒకవైపు ముస్లింల పండుగ మొహర్రం జరుగుతోంది.. మరోవైపు వినాయకచవితి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. పోలీసులు అన్ని ఏర్పాట్లుచేసి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ ప్రధాన భూమిక పోషిస్తోందని చెప్పారు. క్రేన్‌ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం సాగర్‌లో నిమజ్జనం అవుతుందని తెలిపారు. 

మరిన్ని వార్తలు