20లోగా చేప పిల్లల పంపిణీ: తలసాని

10 Nov, 2016 03:17 IST|Sakshi
20లోగా చేప పిల్లల పంపిణీ: తలసాని

సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20లోగా పూర్తి చేయాలని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి బుధవారం జిల్లాస్థాయి మత్స్యశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్‌‌స నిర్వహించారు. అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మత్స్యశాఖ అసిస్టెంట్ డెరైక్టర్, మత్స్యశాఖ అధికారులు, ఆయా జిల్లాల సహకార సంఘాల కమిటీ సభ్యులు కాన్ఫరెన్‌‌సలో పాల్గొన్నారు. పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, ఇన్‌చార్జి కమిషనర్ వెంకటేశ్వర్లు మంత్రితోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 4,318 చెరువులు, రిజర్వాయర్లలో 30 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 60 శాతం లక్ష్యం నెరవేరిందన్నారు.

లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విఫలమైన అధికారులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడబోదని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లోని చెరువులలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. యాదాద్రి, నల్లగొండ, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో  చేపపిల్లలు వదిలే కార్యక్రమం పూర్తకావడంతో అక్కడి అధికారులను మంత్రి అభినందించారు. నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ కార్యక్రమం నత్తనడకగా సాగుతోందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకార సొసైటీల సభ్యులు, అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కోరారు.

మరిన్ని వార్తలు