‘మన కూరగాయలు’ చాలా కాస్ట్‌ గురూ..!

16 Jun, 2018 08:56 IST|Sakshi
విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌ యాదవ్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న  

‘మనకూరగాయల’ రిటైల్‌ విక్రయ కేంద్రాలు ప్రారంభించిన మంత్రులు

ధరలను చూసి కళ్లు తేలేస్తున్న వినియోగదారులు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ప్రవేశపెట్టిన ‘మనకూరగాయలు’ రిటైల్‌ విక్రయ కేంద్రాల్లో ధరలు హాట్‌ హాట్‌గా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. శుక్రవారం మోండా డివిజన్‌ మారేడుపల్లి నెహ్రూపార్కులో ‘మన కూరగాయల’ రిటైల్‌ విక్రయ కేంద్రాన్ని సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు.

తాజా కూరగాయలు తక్కువ ధరలో విక్రయించాలనే సంకల్పంతో ‘మన కూరగాయల’ రిటైల్‌ కేంద్రాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. జన సంచారం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కేంద్రాన్ని ఏర్పాటుచేసి సేల్స్‌మెన్‌ల ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. మన కూరగాయల రిటైల్‌ విక్రయ కేంద్రాన్ని ప్రత్యేక క్యాబిన్‌లో ఏర్పాటు చేశారు. కూరగాయలు తాజాగా ఉండేందుకు  ఏసీని సైతం ఏర్పాటు చేశారు.

అన్నిరకాల కూరగాయలతో పాటు పండ్లను ఈ కేంద్రంలో అమ్మకానికి పెట్టారు. అయితే మన కూరగాయలు  విక్రయ కేంద్రంలో ధరలు చూసి వినియోగదారులు కళ్లు తేలేస్తున్నారు. బయట మార్కెట్‌ ధరల కంటే సుమారు కిలోకు రూ.5 నుంచి 10 వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. సూపర్‌ మార్కెట్ల కంటే అదనంగా రేట్లు ఉండడంపై వినియోగదారులు మండిపడుతున్నారు.

బయటి మార్కెట్‌ కం టే సూపర్‌మార్కెట్‌లో కొంతమేర అధిక ధరలు ఉన్నప్పటికీ అదే స్థాయిలో మనకూరగాయలు విక్రయ కేంద్రంలో ధరలు ఉండడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. నేరుగా రైతు పండించిన కూరగాయలను వినియోగదారులకు అందించాలనే సంకల్పంతో వ్యవసాయ మార్కె టింగ్‌ శాఖ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ధరల్లో వ్యత్యాసం మూలంగా వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

దళారీ వ్యవస్థ నిర్మూలనకు మన కూరగాయలు

తాజా కూరగాయలను అందించడంతో పాటు తక్కువ ధరలో నాణ్యమైన కూరగాయాలను అందించే లక్ష్యంగా ‘మన కూరగాయలు’ విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మన కూరగాయల రిటైల్‌ విక్రయ కేంద్రం ద్వారా దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపవచ్చునని, దీంతో వినియోగదారులకు తక్కువ ధరల్లోనే కూరగాయలు లభిస్తాయన్నారు.

కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో మరికొన్ని మనకూరగాయల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సాయన్న తెలి పారు. డిప్యూటీ డైరెక్టర్‌ పద్మహర్ష, మార్కెట్‌ యార్డు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మోండా మార్కెట్‌ కార్పొరేటర్‌ రూప, నగేశ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు