కరోనా కేసుల పెరుగుదలపై గవర్నర్‌ ఆరా  

17 May, 2020 04:31 IST|Sakshi

పుట్టినరోజు వంటి ఫంక్షన్ల వల్లేనని సర్కారు వివరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితి, గత కొన్ని రోజులుగా కేసుల పెరుగుదలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శనివారం ఆరాతీశారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ), కరోనా రాష్ట్ర నిపుణుల కమిటీ సభ్యుడు బి.కరుణాకర్‌రెడ్డిని రాజ్‌భవన్‌కు పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల పెరుగుదల ప్రధానంగా పుట్టిన రోజు వంటి పార్టీల వల్లనేనని, చాలా కేసులు ఒకే కుటుంబం నుంచి లేదా వలస వచ్చిన కార్మికుల నుంచి వచ్చినవేనని కరుణాకర్‌రెడ్డి వివరించారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కఠినంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరిస్థితి నియంత్రణలో ఉందని అన్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని గవర్నర్‌కు ఆయన వివరించారు. అలాగే పీజీ మెడికల్‌ ప్రవేశాలు, విద్యార్థుల నుంచి ఫీజులకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపైనా వీసీని గవర్నర్‌ వివరణ కోరారు. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని ఆయన తెలిపారు. పీజీ మెడికల్‌ ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వడానికి మరికొంత సమయం ఇస్తామని చెప్పారు.  

మరిన్ని వార్తలు