రాజ్‌భవన్‌లో యోగా చేసిన గవర్నర్‌ తమిళిసై

19 Sep, 2019 16:28 IST|Sakshi

రాజ్‌భవన్ సిబ్బంది కోసం యోగా తరగతులను ప్రారంభించిన గవర్నర్‌

సాక్షి, హైదరాబాద్‌:  రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా యోగా తరగతులను గురువారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రారంభించారు. గవర్నర్‌ దంపతులిద్దరూ రాజ్‌భవన్‌ పరివారంతో కలిసి యోగా తరగతులలో పాల్గొన్నారు. ప్రతి రోజూ ఉదయం 5.30 నుంచి 6.30 వరకూ సంక్షేమ భవన్‌లో నిర్వహించే యోగా తరగతులకు సిబ్బంది, వారి కుబుంబసభ్యులు తప్పక పాల్గొనాలని ఈ సందర్భంగా గవర్నర్‌ కోరారు. 


సాంకేతికతంగా అభివృద్ధి సాధించడంతో సమాజంలో చాలా మంది శారీరక శ్రమను తగ్గించారని, నడకను కూడా చాలా మంది మానివేశారని అన్నారు. శరీరధారుడ్యం ప్రతి ఒక్కరి జీవిత విధానం కావాలని, ఇందుకు ప్రతీ ఒక్కరూ యోగాను అలవాటుగా చేసుకోవాలని గవర్నరు సూచించారు. తాను ప్రతిరోజూ క్రమం తప్పక యోగా సాధన చేస్తానని తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు  ఫిట్ ఇండియా ఉద్యమానికి బలం చేకూర్చేలా మనమందరం యోగా చేద్దామన్నారు. యోగా ప్రాముఖ్యతను తెలంగాణా రాష్రంలోని  ప్రజలందరూ తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత  యోగాను తమ నిత్యకృత్యం చేసుకోవాలని గవర్నరు పిలుపునిచ్చారు. 

రాజ్‌భవన్ స్కూళ్లో..
రాజ్‌భవన్ స్కూల్లో 6 నుండి 10 వ తరగతి వరకూ చదువుతున్న సుమారు 450 విద్యార్థులకు ప్రతి శనివారం యోగా తరగతులు నిర్వహిస్తున్నామని, ఫిట్‌నెస్‌పై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన, ఆత్మవిశ్వాసం పెంపొందించే రీతిలో రాజ్‌భవన్ స్కూల్లో యోగా తరగతులు ప్రారంభించామని అన్నారు.  ప్రముఖ యోగా గురువులు, తెలంగాణా రాష్ట్ర యోగా కమిటీ అధ్యక్షులు రవి కిషోర్ నేతృత్వంలో రాజ్‌భవన్‌లో యోగా తరగతుల నిర్వహిస్తున్నామని  గవర్నర్ కార్యదర్శి కె. సురేంధ్ర మోహన్ తెలిపారు. 

మరిన్ని వార్తలు