నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి

18 Feb, 2020 03:02 IST|Sakshi
సావనీర్‌ను విడుదల చేసిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సాంప్రదాయ వ్యర్థాల నిర్వహణ పద్ధతులను ఉపయోగించుకుని ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. నీటి వ్యర్థాల నిర్వహణలో ప్రజల ఆలోచనా విధానం మారాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నీటి వ్యర్థాల నిర్వహణపై హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను గవర్నర్‌ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నీటి వ్యర్థాల నిర్వహణ సమస్యల పరిష్కారానికి ఒక నిర్ధిష్టమైన కార్యాచరణను రూపొందించాలని సూచించారు. కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి రాజ్‌భవన్‌కు రావాలని విదేశీయులతో పాటు బారత ప్రతినిధి బృందాన్ని గవర్నర్‌ ఆహ్వానించారు.

నీటి వ్యర్థాల శుద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ముంబైలో ప్రతి రోజూ 210 కోట్ల లీటర్ల నీటి వ్యర్థాలు వెలువడుతున్నాయని, వాటి వల్ల వేలాది హెక్టార్లలో పంటలు పండటం లేదని చెప్పారు. భారత్‌లోని కాస్మోపాలిటన్‌ నగరాల్లో 3,600 కోట్ల లీటర్ల నీటి వ్యర్థాలు వెలువడుతున్నాయని తెలిపారు. చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు కలుషితం కావడంతో 30–90 హెక్టార్ల సాగుభూమి ప్రమాదంలో పడుతోందని గణాంకాలు చెబుతున్నాయని వివరించారు. నీటి వ్యర్థాల నిర్వహణపై తెలంగాణ పర్యావరణ పరిరక్షణ శిక్షణ, అధ్యయన సంస్థ, చికాగో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమని అన్నారు. గవర్నర్‌ చేతుల మీదుగా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సావనీర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో «థాయ్‌లాండ్‌ ప్రతినిధి థానెట్, అమెరికా నుంచి కోన్లి ఎగ్గెట్, చికాగో ఎండబ్ల్యూఆర్డీ కమిషనర్‌ ప్రాంక్‌ అవీలా తదితరులు పాల్గొన్నారు.

కల్యాణానికి రండి...
యాదగిరిగుట్ట: ఈ నెల 26వ తేదీనుంచి ప్రారంభమయ్యే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 4వ తేదీన నిర్వహించే శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణ వేడుకకు రావాలని కోరుతూ సోమవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆలయ ఈఓ గీతారెడ్డి, ప్రధాన అర్చకుడు నల్లంధీఘల్‌ లక్ష్మీనరసింహాచార్యులు కలసి ఆహ్వానపత్రిక అందజేశారు.  

మరిన్ని వార్తలు