చట్టబద్దంగా సమ్మెకు దిగితే బెదిరింపులా?

5 Oct, 2019 19:16 IST|Sakshi

కేసీఆర్‌ సర్కారు తీరు సరికాదు

సామరస్యంగా చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలి

సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సాక్షి, సిద్దిపేట: గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చివరి నిమిషంలో ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి.. ఆ చర్చలను కూడా అసంపూర్తిగా ముగించారని ఆయన తప్పుబట్టారు. సిద్దిపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోర్కెలను ఆమోదించకుండా ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని, కార్మికులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని, వారిని అరెస్ట్ చేస్తామని, పోటీ కార్మికులను దించుతామని భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని సహించడం లేదని దుయ్యబట్టారు. చట్టబద్ధంగా, న్యాయంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను బెదిరించాలని చూడడం సబబు కాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే సామరస్యంగా చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని కోరారు. ఆర్టీసీ సమ్మెతో పండగ సందర్భంగా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం చాలా దురదృష్టకరమని, ఈ ఎన్నికలో సీపీఎం భావాలకు దగ్గరగా ఉన్న అభ్యర్థులకు తాము మద్దతిస్తామని, దీనిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలతో ప్రజలు బాధలు పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా