ముంచి తుంచుతామంటే ఊరుకోం

17 Oct, 2014 03:20 IST|Sakshi
ముంచి తుంచుతామంటే ఊరుకోం

వీఆర్‌పురం: పోలవరం పేరుతో జిల్లా నుంచి వేరు చేసిన ఏజెన్సీ ప్రజలను గిరిజన చట్టాలకు విరుద్ధంగా నీటముంచి..వారి బతుకులను తుంచివేసే ప్రయత్నాలను చూస్తూ ఊరుకోమని సీపీఎం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, పి. మధు హెచ్చరించారు. నిర్వాసిత ప్రజలకు అండగా ఉంటామన్నారు. నిర్వాసితుల విషయంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తీరును వారు తప్పుబట్టారు. రేఖపల్లిలోని ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ముంపు మండలాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన వీరభద్రం, మధు మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీపీఎం దశల వారీ పోరాటాలు చేస్తోందన్నారు. పోలవరం నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలన్నదే సీపీఎం డిమాండ్ అన్నారు. దీనికి ఎంతటి పోరాటాలకైనా వేనుకాడేది లేదన్నారు. దేశంలో ఇప్పటి వరకు నిర్మించిన ప్రాజెక్టుల కింద నష్టపోయిన నిర్వాసితులకు ఎక్కడా న్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు. వాటి మాదిరిగానే పోలవరం నిర్వాసితులనూ చేయాలని కేంద్ర ం, ఏపీ ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. నిర్వాసితుల మెరుగైన ప్యాకేజీ కోసం తమ పార్టీ చేసే పోరాటాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు నాన్ ఏజెన్సీ ప్రాంతంలో పునరావాసం క ల్పించి గిరిజన చట్టాలను కాలరాసే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తోందని మాజీ ఎంపీ మిడియం బాబూరావు మండిపడ్డారు. దీనిపై పార్టీ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలు చేస్తామన్నారు. ప్రతి నిర్వాసితునికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటాలు ఆపేది లేదన్నారు.

కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి, పార్టీ ఖమ్మం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కార్యదర్శులు పోతినేని సుదర్శన్, దడాల సుబ్బారావు, సీతారామ్, నాయకులు బండారు రవికుమార్, బ్రహ్మచారి, తిలక్, శేషావతారం, వెంకటేశ్వర్లు, పుల్లయ్య, సత్యనారాయణ, శిరమయ్య పాల్గొన్నారు.
 
ముంపు మండలాల ప్రత్యేక కమిటీ ఎన్నిక
పోలవరం నిర్వాసితుల పక్షాన పోరాటం చేసేందుకు ముంపు మండలాల ప్రత్యేక కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తమ్మినేని, మధు ప్రకటించారు.ఈ కమిటీ కార్యదర్శిగా మిడియం బాబూరావు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే రాజయ్య, బీబీజీ తిలక్, దాకి శేషావతారం, కుంజా సీతారామయ్య, లక్ష్మయ్య కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ముర్లపాటి నాగేశ్వరరావు, ఐ.వెంకటేశ్వర్లు, మడివి దుర్గారావు, పూనెం సత్యనారాయణ, కారం శిరమయ్య, సున్నం నాగమ్మ, సోయం చినబాబు, మేకల నాగేశ్వరరావు, కొమరం పెంటయ్య కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు