‘పట్నం’ జలసిరికి కొర్రీ!

13 May, 2015 00:43 IST|Sakshi

దశాబ్దాలుగా నీళ్లులేక నోళ్లు తెరిచిన చారిత్రక ఇబ్రహీంపట్నం చెరువుకు జలకళ సంతరింపజేసే విషయంలో జలమండలి కొర్రీలు పెడుతోంది. ఇప్పటికే పూర్తయిన కృష్ణా మూడో దశ పైపులైన్ ద్వారా నల్గొండ జిల్లా కోదండాపూర్ ఏఎంఆర్‌పీ కాల్వ నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు 90 ఎంజీడీల కృష్ణాజలాలను తరలించనున్నారు. అయితే ఇదే మార్గంలోఉన్న ఈ చెరువును శుద్ధిచేయని (రా వాటర్) జలాలతో నింపే అవకాశం ఉన్నప్పటికీ జలమండలి అభ్యంతరం వ్యక్తం చేయడం ‘పట్నం’ చెరువుకు శాపంగా పరిణమిస్తోంది.
 
 చెరువును నింపే విషయంలో వాటర్‌బోర్డు అధికారుల మోకాలడ్డు!
 - కృష్ణా మూడోదశ ద్వారా మొత్తం తరలించనున్న నీరు 5.5 టీఎంసీలు
- పట్నం చెరువు నింపడానికి అవసరమయ్యేది 0.5 టీఎంసీలే
- సాంకేతికంగా సాధ్యమేనంటున్న నీటిపారుదల రంగ నిపుణులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
: ‘పట్నం’ చెరువు నింపే అంశంపై వాటర్‌బోర్డు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. చెరువు నింపేందుకు అన్ని రకాలుగా అవకాశాలున్నప్పటికీ అధికారులు తటపటాయిస్తున్నారు. ఇటీవల గులాబీ గూటికి చేరిన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం చెరువును శుద్ధిచేయని జలాలతో నింపాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రధాన డిమాండ్ నెరవేర్చేందుకు హామీ ఇచ్చినందునే పార్టీలో చేరుతున్నట్లు కిషన్‌రెడ్డి ప్రకటించారు కూడా.

అయితే చెరువు నింపేందుకు అన్ని అవకాశాలున్నప్పటికీ వాటర్‌బోర్డు అధికారులు అందుకు ససేమిరా అనడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఖరీదైన శుద్ధి చేసిన జలాలతో చెరువును నింపడం సాధ్యంకాదని.. కానీ రా వాటర్‌ను నింపే అంశంపై అధ్యయనం చేస్తామని ప్రకటించడంతో స్థానికుల్లో కొత్త ఆశలు చిగురించాయి.  

0.5 టీఎంసీలు చాలు!
ఇబ్రహీం కులీ కుతుబ్‌షా నిర్మించిన ఈ చెరువు సామర్థ్యం 0.5 టీఎంసీలు మాత్రమే. ఒకసారి ఈ చెరువు నిండితే మూడేళ్లలో సుమారు 42 గ్రామాల కరువు తీరనుంది. సబ్బండ చేతివృత్తుల కులాలకు కరువుతీరా ఉపాధి లభించనుంది. అయితే, ఈ చెరువు నింపే అంశంపై సానుకూలంగా స్పందిస్తే కోదండాపూర్ నుంచి సాహెబ్‌నగర్ (103 కి.మీ) వరకు మార్గమధ్యంలోని చెరువులకు కూడా జలాలను తరలించాలనే డిమాండ్ వస్తుందని జలమండలి అనుమానిస్తోంది.

దీంతో గ్రేటర్‌లో తాగునీటి అవసరాలకు ఈ పరిణామం ఆశనిపాతంగా మారుతుందని భావిస్తోంది. వాస్తవానికి కృష్ణా మూడో దశ కింద 40 ఫిల్టర్ బెడ్లను (కోదండాపూర్) పూర్తి చేయాల్సివుంది.  దీంట్లో ఇప్పటికీ పది ఫిల్టర్ బెడ్లను మాత్రమే నిర్మించారు. వీటి ద్వారా 45 ఎంజీడీలను రాజధాని తాగునీటి అవసరాలకు తరలించారు. మరో 35 ఫిల్టర్‌బెడ్ల నిర్మాణానికి మూడు నెలల సమయం పట్టే అవకాశముంది. ఈ మధ్యకాలంలో 0.5 టీఎంసీల శుద్ధిచేయని జలాలతో ఇబ్రహీంపట్నం చెరువు నింపేందుకు అన్నివిధాలా అవకాశముందని, మూడోదశ ద్వారా తరలించనున్న మొత్తం 5.5 టీఎంసీల్లో 0.5 టీఎంసీల నీళ్లు పెద్ద విషయమేమీ కాదని నీటిపారుదలశాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, ‘పట్నం’ చెరువుకు జలసిరి రాకుండా వాటర్‌బోర్డు ఉన్నతాధికారులు మోకాలడ్డుతుండడం చర్చనీయాంశంగా మారింది.
 
చెరువు నింపడం తథ్యం: మంచిరెడ్డి
శుద్ధిచేయని కృష్ణాజలాలతో ‘పట్నం’ చెరువును నింపేందుకు వాటర్‌బోర్డు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. సోమవారం ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశా. 35 ఫిల్టర్‌బెడ్ల నిర్మాణంలోపు నగరానికి వచ్చే 45 ఎంజీడీల నుంచి 0.5 టీఎంసీలను చెరువు నింపేందుకు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. వాటర్‌బోర్డు అధికారులు కూడా అందుకనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు