ఇసుక లారీని ఢీకొన్న ట్యాంకర్‌

4 May, 2019 02:44 IST|Sakshi
ప్రమాదంలో కాలిపోయిన లారీలు, విజయపోక్రే (ఫైల్‌)  

మంటల్లో చిక్కి డ్రైవర్‌ సజీవ దహనం 

ధర్మపురి: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఇసుక లారీని ట్యాంకర్‌ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్‌ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. నేరెళ్ల సాంబశివ దేవాలయం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద గల జాతీయ రహదారి పక్కన ఇసుక లారీ (టీఎస్‌19 టీ1159) టైరు పంక్చర్‌ కావడంతో నిలిపివేశారు. శుక్రవారం తెల్లవారు జామున రామగుండం నుంచి నాందేడ్‌కు బయలుదేరిన ట్యాంకర్‌ నేరెళ్ల వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా ట్యాంకర్‌ ఇంజన్‌లో మంటలు అంటుకున్నాయి. డ్రైవర్‌ విజయపోక్రే (30) క్యాబిన్‌లోనే చిక్కుకోవడంతో సజీవ దహనమయ్యాడు. డ్రైవర్‌ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా బాబులేశ్వర్‌ వాసిగా గుర్తించారు.
 
రెండు గంటలపాటు చెలరేగిన మంటలు  
కాగా, ట్యాంకర్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు గంటల పాటు మంటలు చెలరేగాయి. ఇసుక లారీ టైర్లు కాలి బూడిదయ్యాయి. ట్యాంకర్‌ ఢీకొట్టిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో లారీని మరమ్మతు చేస్తున్న డ్రైవర్, క్లీనర్లు దూరంగా పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ట్యాంకర్‌లో ఇంధనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రాకపోకలు నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు