18 రోజుల్లో నల్లా కనెక్షన్‌

26 Jan, 2019 11:07 IST|Sakshi
వినియోగదారుల సమస్యలను తెలుసుకుంటున్న ఎండీ దానకిశోర్‌

లేనిపక్షంలో సంబంధిత

అధికారులపై కఠిన చర్యలు

జలమండలి ఎండీ దానకిశోర్‌

సాక్షి,సిటీబ్యూరో: నల్లా కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ 18 రోజుల్లో నూతన నల్లా కనెక్షన్‌ మంజూరు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ దానకిశోర్‌  అధికారులను ఆదేశించారు. లేని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో నిర్వహణ, ప్రాజెక్టు విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రివేళల్లో నీటి సరఫరా జరిగే ప్రాంతాలను గుర్తించి..సరఫరా వేళలను మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఔటర్‌రింగ్‌రోడ్డు లోపల ఉన్న గ్రామాల దాహార్తిని తీర్చే ఓఆర్‌ఆర్‌ తాగునీటి పథకం పనులను ఫిబ్రవరి 15లోగా పూర్తిచేయాలని..హడ్కో ప్రాజెక్టులో మిగిలిన జంక్షన్లు, గ్యాపుల పనులను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. హడ్కో, ఓఆర్‌ఆర్‌ తాగునీటి పథకం ప్రాజెక్టులు చేపట్టిన ప్రాంతాల్లో  బీపీఎల్, నాన్‌ బీపీఎల్‌ నల్లా కనెక్షన్ల జారీపై సమగ్ర సర్వే నిర్వహించి నూతన నల్లా కనెక్షన్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని, వినియోగదారులకు కనెక్షన్లు ఎలా పొందాలన్న అంశంపై అవగాహన కల్పించాలని సూచించారు.

బోర్డు రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు కృషిచేయాలన్నారు. లీకేజీలు, కలుషిత జలాలపై అందే ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. సింగిల్‌ విండో విభాగంలో నూతన నల్లా కనెక్షన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.  అమీర్పేట్, మెఘల్‌ పురా, అల్వాల్, మల్కాజ్‌గిరి   ప్రాంతాల నుంచి అరకొర నీటి సరఫరా, లో ప్రెషర్, బిల్లింగ్, రెవెన్యూలకు సంబంధించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్‌ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవి, ప్రాజెక్టు డైరెక్టర్‌ డి. శ్రీధర్‌ బాబు, రెవెన్యూ డైరెక్టర్‌ బి. విజయ్‌ కుమార్‌ రెడ్డి, పీ అండ్‌ ఏ డైరెక్టర్‌ వి.ఎల్‌. ప్రవీణ్‌ కుమార్‌లతో పాటు  ఓ అండ్‌ ఎమ్‌ సర్కిల్,  రెవెన్యూ, ప్రాజెక్టు విభాగాలకు చెందిన చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు, జీఎమ్‌లు, డీజీఎమ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు