బొందలగడ్డపై గద్దలు!

19 Jul, 2015 23:39 IST|Sakshi
బొందలగడ్డపై గద్దలు!

♦ ఐదు వేల గజాల స్థలానికి ఎసరు
♦ మార్కెట్ విలువ రూ. ఐదు కోట్లకు పైమాటే..
♦ కబ్జానుంచి కాపాడాలని స్థానికుల విన్నపం
 
 వికారాబాద్ :  విలువైన స్థలం కబ్జాకోరల్లో చిక్కుకుంది. మున్సిపల్ పరిధిలో ఏదో ఒక చోట ఎవరో ఒకరు వారికి అబ్బినంత కబ్జా చేయడానికి సిద్ధమవుతున్నారు. చట్టబద్ధంగా తప్పించుకునేం దుకు అన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని ఆక్రమించుకునేందుకు తమదైన శైలిలో భూ బకాసురులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన మున్సిపల్ స్థలాలు అక్రమార్కుల చెంతకు చేరిన విషయం అనేకమార్లు పత్రికల్లో వచ్చినా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు.  గతంలో మున్సిపల్ స్థలం కబ్జా చేసి భూ బకాసురులు ఇళ్ల నిర్మాణాలు చేశారు.

 సమాధుల స్థలంపై కన్నేసిన భూబకాసురులు
 రామయ్యగుడ ఎంఐజీ సమీపంలోని వికారాబాద్ నుంచి అనంతగిరి పల్లి వైపు వెళ్లే రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 224, 225లో 5 వేల గజాలకు పైగా స్థలం ఉంది. ఇది అప్పట్లో ప్రభుత్వం ఎంఐజీ, ఎల్‌ఐజీలో ఉంటున్న ప్రజలకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను శ్మశానవాటికకు స్థలాన్ని హౌజింగ్ బోర్డు వారు కేటాయించారు. ఇందులో ఇప్పటికే అనేక మంది చనిపోతే అక్కడే సమాధులను ఏర్పాటు చేశారు. సమాధులు సుమారుగా 10 నుంచి 15 వరకు ఒకేచోట ఉన్నాయి. మిగిలిన స్థలం మాత్రం హాట్‌కేక్‌లా ఉంటుంది. సమాధుల స్థలానికి రెండువైపులా రోడ్డు మార్గాలున్నాయి.

ఈ స్థలం సుమారుగా 5 వేల నుంచి 6 వేల గజాల వరకు ఉంటుందని స్థానిక ఎంఐజీ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఈ స్థలం గజం విలువ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పలుకుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో భూబకాసురుల కన్ను గ్రేవీయార్డుపై పడింది. రోడ్డుకు ఇరువైపులా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయలు తమ సొంతం అవుతాయని భావించి కొందరు ఆ దిశగా ప్రణాళికను రూపొందించారు. అనుకున్నదే తడువు మున్సిపల్ పాలకవర్గంలో ఉన్న కొందరు కీలకనేతలు, రెవెన్యూ విభాగంలో కీలకపోస్టుల్లో ఉన్నవారి అండదండలతో సమాధుల స్థలం కొల్లగొట్టడానికి శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో రికార్డులను పకడ్బందీగా మార్చేందుకు ప్రణాళికను రూపొందించారు. ఈ మేరకు సంబంధిత స్థలం రికార్డుల ఫైల్ స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన వారే ఇలా చేస్తే ఎలా అని ప్రజలు నిలదీస్తున్నారు. సబ్‌కలెక్టర్ స్పందించి గ్రేవీయార్డుకు కేటాయించిన ఖాళీస్థలం చుట్టూ పెన్సింగ్ వేసి భూ బకాసురుల పాలు కాకుండా చూడాలని ఎంఐజీ కాలనీ ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు