రాలిన మరో కుసుమం

28 Jul, 2014 23:50 IST|Sakshi

తూప్రాన్: గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న తరుణ్(9) చివరికి సోమవారం తనువు చాలించాడు. దీంతో మాసాయిపేట దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. ఈ నెల 24న తూప్రాన్ పట్టణంలోని కాకతీయ హైస్కూల్‌కు చెందిన బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 14 మంది చిన్నారులతో పాటు బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందగా మరో 20 మంది చిన్నారులు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెల్దుర్తి మండలం గుండ్రెడ్డిపల్లికి చెందిన తరుణ్‌ను అదే రోజు యశోద ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

 గుండ్రెడ్డిపల్లిలో విషాదం
 గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలారి శ్రీశైలం, బాలమణి దంపతులకు తరుణ్, స్వాతి సంతానం. కుమారుడిని ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనుకున్న తల్లిదండ్రులు తూప్రాన్‌లోని కాకతీయ హైస్కూల్లో చేర్పించారు. ఈ క్రమంలోనే పాఠశాల బస్సును రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన తరుణ్, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తమ బిడ్డలను ప్రాణాలతోనే చూస్తామని ఇన్నాళ్లూ ఆశించిన తరుణ్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తరుణ్ మృతితో గుండ్రెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. తరుణ్ మృతదేహాన్ని యశోద నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించిన వైద్యులు మంగళవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు