వచ్చేస్తోంది ‘తరుణి’ ఎగ్జిబిషన్‌

19 Apr, 2019 08:05 IST|Sakshi

రేపు మధురానగర్‌ మెట్రో స్టేషన్‌లో ప్రారంభం

పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నిర్వహణ

జూబ్లీహిల్స్‌/సాక్షి,సిటీబ్యూరో: పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడిచే ‘తరుణి ఎగ్జిబిషన్‌’ను మధురానగర్‌ మెట్రోస్టేషన్‌ ఆవరణలో శనివారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మహిళల కోసమే ప్రత్యేకంగా మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దిన ఘనత నగర మెట్రో సొంతమని ఆయన అన్నారు. ఈ స్టేషన్‌ లోకి పురుషులు, మహిళలు ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ నిర్వహణ బాధ్యతలు మాత్రం మహిళలవేనన్నారు. లింగ సమానత్వ సాధన, మహిళల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లను మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి గురువారం పరిశీలించారు.

 ఎగ్జిబిషన్‌ ప్రత్యేకతలివే..
ఈ ప్రదర్శన తిలకించేందుకు వచ్చే వారికి ప్రవేశం ఉచితం. మొత్తం 130 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు.
మహిళలకు సంబంధించిన అన్ని రకాల వినియోగ, గృహ అవసర వస్తువులు, చిన్నారులకు సంబంధించిన అన్నిరకాల వస్తువులు లభ్యమవుతాయి.
ప్రదర్శనకు వచ్చేవారి సౌకర్యార్థం వెయ్యి ద్విచక్ర వాహనాలు, 100 కార్లు ఒకేసారి పార్కింగ్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తారు.
ఎగ్జిబిషన్‌లో తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
చిన్నారులకు ఆట పాటల కోసం ప్రత్యేక సదుపాయాలు, గేమ్స్‌జోన్, ఫుడ్‌ కోర్టులు ఉంటాయి.
సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు.
సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
మెట్రో ప్రయాణికులతో పాటు, రోడ్డు మార్గాన వచ్చేవారు సులువుగా ప్రదర్శన జరిగే ప్రాంతానికి చేరుకునే వీలు
ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య మహిళలు, పురుషులకు వేర్వేరుగా యోగా శిక్షణ  
యోగా, పెయింటింగ్‌ నేర్చుకోవాలనే ఆసక్తిగల వారు ఈ నెల 24వ తేదీ లోగా పేర్లను నమోదు చేసుకోవాలి.  
వివరాలకు: 040–23388588, 23388587 నంబర్లలో సంప్రదించవచ్చు.
ఈమెయిల్‌: హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ ఎట్‌ ది రేట్‌ జిమెయిల్‌.కామ్‌లో కూడా చూడవచ్చు.

మరిన్ని వార్తలు