కరోనా: టాస్క్‌ఫోర్స్‌కు రిస్క్‌! 

18 May, 2020 07:00 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితుడు (ఫైల్‌)

గత నెలలో అరెస్టు చేసిన నిందితుడికి ‘స్టాంప్‌’ 

తాజాగా రెస్క్యూ చేసిన బాలుడికి పాజిటివ్‌ 

ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారులు, సిబ్బంది 

పీపీఈ కిట్లు అందించాలంటూ వేడుకోలు 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయడం, లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడం..నిర్దేశించిన కంటైన్‌మెంట్‌ జోన్ల పర్యవేక్షణ.. పాజిటివ్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌పై నిఘా..వంటి ముఖ్య అంశాల్లో పోలీసు విభాగం పాత్ర అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు ఐదుగురు సిబ్బంది దీని బారినపడ్డారు. సిటీ పోలీస్‌కు గుండెకాయ వంటి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను కరోనా వెంటాడుతోంది. ప్రధానంగా తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఈ భయం మరీ ఎక్కువైంది. గత నెల్లో వీళ్లు అరెస్టు చేసిన ఓ నిందితుడికి ఉస్మానియా వైద్యులు క్వారంటైన్‌ స్టాంప్‌ వేయడంతో ఉలిక్కిపడ్డారు. తాజాగా వీళ్లు రెస్క్యూ చేసిన బాలుడికి పాజిటివ్‌ రావడంతో కొందరు హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.  (17 రోజులు.. 93 రైళ్లు.. 1.18 లక్షల మంది )

నిందితుడికి ‘స్టాంప్‌’ వేయడంతో... 
ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత నెల 11న ఓ ఘరానా దొంగను అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా చంటపల్లి తండాకు చెందిన జటావత్‌ మహేష్‌ హైదరాబాద్‌ నగరంతో పాటు నల్లగొండలోని అనేక ప్రాంతాల్లో 50కి పైగా దొంగతనాలు చేశాడు. మైనర్‌గా చిక్కిన మహేష్‌ను అధికారులు జువైనల్‌ హోమ్‌లో ఉంచారు. ఈ ఏడాది మార్చిలో అక్కడ నుంచి పరారయ్యాడు. ఆపై కంచన్‌బాగ్, సరూర్‌నగర్, నల్లగొండ, మలక్‌పేట్‌ల్లో నేరాలు చేశాడు. ఇతడిని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత నెల 11న పట్టుకున్నారు. విచారణ, రికవరీ, అరెస్టు తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికి మహేష్‌ జ్వరంతో ఉండటం, కరోనా విజృంభిస్తుండటంతో వైద్యులు అతడికి హోం క్వారంటైన్‌ స్టాంప్‌ వేశారు. కోర్టు సైతం ష్యూరిటీపై విడిచిపెట్టాలని ఆదేశించడంతో ఇతడికి రిమాండ్‌ తప్పింది. ఇతడి క్వారంటైన్‌ సమయం 14 రోజులు ముగిసే వరకు పోలీసులకు కంటి మీద కునుకులేదు. చివరకు అంతా సజావుగానే జరగడంతో ఊపిరిపీల్చుకున్నారు. 

రెస్క్యూ చేసిన బాలుడికి పాజిటివ్‌..
చాదర్‌ఘాట్‌ పరిధిలో చోటు చేసుకున్న ఓ బాలుడి కిడ్నాప్‌ కేసును ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రెండు రోజుల క్రితం ఛేదించారు. శుక్రవారం ఆ బాలుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో కొందరు అధికారులు, సిబ్బంది హోమ్‌ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్‌ ముందు నిద్రిస్తున్న యాచకురాలి నుంచి ఈ నెల 13 ఉదయం ఆమె కుమారుడిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్‌ చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాదర్‌ఘాట్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఠాణా ఈస్ట్‌జోన్‌ పరిధిలోకి రావడంతో తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ టీవీల్లో రికార్డు అయిన ఫుటేజ్‌లతో పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు ఈ కేసును 48 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అతడి చెరలో ఉన్న యాచకురాలి కుమారుడిని రెస్క్యూ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా..ఆ బాలుడికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు శుక్రవారం తేలింది. దీంతో ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్, చాదర్‌ఘాట్‌ పోలీసులు కలిపి మొత్తం 22 మంది హోం క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ కేసులో నిందితుడు ‘ఠాణా క్వారంటైన్‌’లో ఉన్నాడు. ఈ ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులతో పాటు బాలుడి తల్లి నుంచీ వైద్యులు నమూనాలు సేకరించారు. ఆ నివేదిక రావాల్సి ఉండటంతో టాస్క్‌ఫోర్స్‌ సహా పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి.  

అరెస్టుల్లో అధికం ఆ ప్రాంతాల్లోనే..
ప్రస్తుతం నగరంలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే రాజధానిలోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నగరంలోనూ ప్రధానంగా స్లమ్స్‌లోనే ఈ కేసుల విస్తరణ ఎక్కువని కనిపిస్తోంది. ఇదిలా ఉండగా... పాత నేరగాళ్లు, వాంటెడ్‌ వ్యక్తులు ఉండేది కూడా ఇదే ప్రాంతాల్లో. వీరి కదలికలపై ఏమాత్రం ఉప్పందినా తొలుత రంగంలోకి దిగేది టాస్క్‌ఫోర్స్‌ పోలీసులే. వీటికితోడు ఈ పోలీసులు అనేక ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు, సోదాలు చేపడుతున్నారు. అలా చేయడం వల్లే శుక్రవారం నకిలీ నెయ్యి, మద్యం లభించాయి. ఈ రకంగా సర్వకాల సర్వావస్థల్లోనూ విధులు నిర్వర్తించే తమకు ఉన్నతాధికారులు పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లు అందించాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కోరుతున్నారు. మరోపక్క తాజా పరిణామాల నేపథ్యంలో అత్యవసర, లాక్‌డౌన్‌ సంబంధిత కేసుల మినహా ఇతర రొటీన్‌ కేసుల జోలికి పోవద్దని అధికారులు సిబ్బందికి స్పష్టం చేస్తున్నారు. ఆ కేసుల్లో నిందితులు, అనుమానితులు, బాధితులు వారి బంధువులు..ఇలా ఎవరినీ నేరుగా తాకవద్దని, తాకాల్సి వస్తే కచ్చితంగా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

>
మరిన్ని వార్తలు