పాఠశాలల్లో.. పసందైన భోజనం

30 Dec, 2014 22:57 IST|Sakshi
పాఠశాలల్లో.. పసందైన భోజనం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తెలంగాణ సర్కార్ కొత్త సంవత్సరం కానుక ప్రకటించింది. స్కూళ్లు.. హాస్టళ్లలో చదివే వారికి సన్న బియ్యంతో వండిన భోజనం అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దొడ్డు బియ్యంతో విద్యార్థులు పడిన అవస్థలకు తెరపడనుంది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులతో పాటు పాఠశాలల్లో భోజనం చేసే వారి సంఖ్య కూడా పెరగనుంది. జనవరి 1నుంచి జిల్లాలోని అన్ని స్కూళ్లలో సన్నబియ్యం అన్నం వడ్డించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
 
మెదక్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పోషకాహారాన్ని అందిస్తూ.. హాజరు శాతాన్ని పెంచే లక్ష్యంతో 2003లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం 13 అక్టోబర్ 2008 నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా దీన్ని విస్తరించారు. అయితే 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో, 9,10 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భోజనాన్ని అందిస్తున్నారు.

1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు 100 గ్రాముల బియ్యం, కూరగాయల కోసం రూ.4.35 చెల్లిస్తారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం, కూరగాయలకు రూ.6 చొప్పున చెల్లిస్తారు. స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళలు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలుగా ఏర్పడి వంటల చేయాల్సి ఉంటుంది.

దీనికోసం వీరికి నెలకు రూ.1,000 పారితోషికం అందజేస్తున్నారు. అయితే నాణ్యమైన బియ్యం సరఫరా కాకపోవడం, నెలనెలా ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మహిళలకు బిల్లులు రాకపోవడంతో పాఠశాలల్లో నాసిరకం భోజనం అందుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికీ 1 నుంచి 8 తరగతులకు సంబంధించి రెండు నెలలు, 9,10 తరగతులకు సంబంధించి 3 నెలల బిల్లులు రావాల్సి ఉందని ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలల్లో భోజనం చేసే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం...
జిల్లాలో సన్న బియ్యం పధకం కింద 3,23,487 మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. 502 ఉన్నత పాఠశాలలు, 423 ప్రాథమికోన్నత, 1974 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 3,23,487 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తుంటే, మరి కొన్ని పాఠశాలల్లో ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మహిళలు వంటలు చేస్తున్నారు.

కిచెన్ షెడ్లు లేక ఆరుబయటే వండుతుండటం, నాణ్యత లేని దొడ్డు బియ్యంతో వంటలు నాసిరకంగా ఉండటంతో సుమారు 20 శాతం మంది విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా స్కూళ్లలో భోజనం తీసుకునే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం మధ్యాహ్న భోజనంతో విద్యార్థులకు 300 కేలరీల శక్తి, 8 నుంచి 12 శాతం ప్రోటీన్లు, పోషకాహార పదార్ధాలు అందజేయాలి. మెనూ ప్రకారం వారానికి రెండు సార్లు గుడ్లు, ఆకుకూరలు, పప్పులు అందజేయాలి. ఏజెన్సీ మహిళలకు నెల నెలా బిల్లులు చెల్లిస్తూ, మెను అమలు చేస్తే మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం చేరే అవకాశం ఉంటుందని పోషకులు అభిప్రాయ పడుతున్నారు.
 
నాణ్యమైన భోజనం అందిస్తాం
సన్న బియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం అందిస్తాం. జనవరి మొదటి నుంచే సన్నబియ్యం పంపిణీ చేస్తాం. హెచ్‌ఎంలు అందరూ తగిన చర్యలు తీసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి నెలా మధ్యాహ్న భోజన పథకం కోసం 9,183 క్వింటాళ్ల బియ్యం, వసతి గృహాలకు 5,941 క్వింటాళ్ల బియ్యం ప్రతి నెలా అవసరమవుతాయి.
- రాజేశ్వర్‌రావు, డీఈఓ

మరిన్ని వార్తలు