ఫంక్షన్‌..పన్ను టెన్షన్‌

16 May, 2019 02:13 IST|Sakshi

ఇకపై 18% జీఎస్టీ 

వేడుక జరిగితే పన్ను కట్టాల్సిందే

కన్వెన్షన్లు, ఫంక్షన్‌ హాళ్ల వివరాల సేకరణ

ఫంక్షన్‌ హాల్‌ యాప్‌లో పొందుపరుస్తున్న అధికారులు 

అన్ని రకాల సేవలకు పన్ను కట్టాల్సిందే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్‌ హాళ్లు జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. విందు, వినోదం.. కార్యం ఏదైనా ఫంక్షన్‌ హాల్‌లో జరిగితే ఇకపై పన్ను కట్టాల్సిందే. ఫంక్షన్‌హాల్‌లో ఏ కార్యం చేసినా బిల్లులో 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ కొత్తగా ఫంక్షన్‌ హాల్‌ యాప్‌ రూపొందించింది. జీఎస్టీ వర్తించక ముందు ఫంక్షన్‌ హల్‌ బిల్లును సర్వీస్‌ ట్యాక్స్‌ ద్వారా చెల్లించేవారు. అయితే తాజాగా ఫంక్షన్‌ హాల్‌ సేవలతో పాటు వస్తువుల కేటగిరీలోకి రావడంతో జీఎస్టీ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రవ్యాప్తగా వార్షిక అద్దె రూ.20 లక్షల కన్నా ఎక్కువ ఉన్న అన్ని ఫంక్షన్‌ హాళ్లను జీఎస్టీ పరిధిలోకి తెస్తున్నారు. ఇప్పటివరకు ఫంక్షన్‌హాల్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వచ్చినా కూడా పన్నులు చెల్లించ ట్లేదని గ్రహించిన వాణిజ్య పన్నుల శాఖ.. ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో ఫంక్షన్‌ హాల్స్‌ అద్దెలు కూడా పెరగనున్నాయి. కేటరింగ్, డెకరేషన్, వినోదంతో పాటు అన్ని రకాల సేవలకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

ఆధునిక పరిజ్ఞానంతో..
పన్ను వసూళ్ల కోసం వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. ఇప్పటికే ఐఓసీ, ఆర్‌డీ యాప్‌లతో సిబ్బందికి టార్గెట్‌లు కేటాయించి పన్నుల బకాయిలు వసూలు చేస్తోంది. ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్‌ హాల్‌లను జీఎస్టీ పరిధిలో తీసుకురావడానికి జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే జీఎస్టీలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఫంక్షన్‌ హాల్‌లు పూర్తి సమాచారాన్ని కొత్త యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇంకా జీఎస్టీలో నమోదు చేసుకొని ఫంక్షన్‌ హాళ్లను యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ఈ యాప్‌ ద్వారా ఫంక్షన్‌ హాళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం యాప్‌లో పొందుపరచడంతో అధికారులు, సిబ్బందికి రిజిస్ట్రేషన్‌ సులభమైందని అధికారులు చెబుతు న్నారు.

ఈ యాప్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్‌ హాల్స్, సొంతం ఎన్ని.. కంపెనీలు, పార్ట్‌నర్‌షిప్‌లో ఎన్ని ఉన్నాయనే వాటిపై వివరాలు సేకరిస్తున్నారు. ఫంక్షన్‌ హాల్‌ వైశాల్యం తదితరాలతో పాటు పాటు ఉద్యోగుల సంఖ్యపై ఆరా తీస్తున్నారు. ఫంక్షన్‌ హాల్‌లో సామగ్రిపై కూడా నజర్‌ వేస్తున్నారు. ఒకవేళ ఫంక్షన్‌ హాల్‌ నిర్వాహకులు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే వారు డీఆర్‌సీ ఫామ్‌–3 ద్వారా పన్ను బకాయిలు చెల్లిస్తే వడ్డీ మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అలా కాకుండా రిజిస్ట్రేషన్‌ చేయించు కోకుండా పన్నులు ఎగ్గొడితే వడ్డీతోపాటు జరిమా నాతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఫంక్షన్‌ హాల్‌ యాప్‌తో ఫంక్షన్‌ హాళ్లకు సంబంధించి పన్నుల వసూళ్లు సులభమవు తున్నాయని అధికారులు చెబు తున్నారు.

>
మరిన్ని వార్తలు