పన్నుల వాటాలో ‘మొండిచేయే’!

4 Mar, 2020 01:52 IST|Sakshi

ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఆదుకోని కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రావడం లేదు. ఈ ఏడాది కేంద్ర పన్నుల వాటా కింద రూ. 14,348 కోట్లు వస్తాయనే అంచనాలో రాష్ట్ర ప్రభుత్వం ఉండగా అందులో జనవరి ముగిసే నాటికి 66 శాతమే వచ్చాయి. వాస్తవానికి 2019–20 బడ్జెట్‌లో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాను దాదాపు 18 శాతంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం రూ. 14,348 కోట్లు వస్తాయనే అంచనా ఉండగా చివరి త్రైమాసికం ప్రారంభమయ్యే జనవరి ప్రారంభానికి రూ. 8,449.85 కోట్లను కేంద్రం ఇచ్చింది.

ఇక చివరి త్రైమాసికంలో మిగిలిన రూ. 6 వేల కోట్లకుపైగా నిధులు రావాల్సి ఉంది. అంటే కనీసం నెలకు రూ. 2 వేల కోట్లయినా పన్నుల వాటా కింద రావాలి. కానీ జనవరిలో కేంద్ర పన్నుల వాటాలో కేవలం రూ. వెయ్యి కోట్లే మంజూరు చేసింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలలకు కలిపి ఇంకో రూ. 5 వేల కోట్లు రావాల్సి ఉంది. అయితే ఈ రెండు నెలల్లో కేంద్రం నుంచి ఆ స్థాయిలో నిధులు రావడం కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు