కొత్త పురపాలికల్లో బాదుడు షురూ! 

28 Aug, 2018 01:49 IST|Sakshi

68 కొత్త మునిసిపాలిటీలు, 131 విలీన గ్రామాల్లో పన్నులు, చార్జీల మోత

ఆస్తి పన్ను మినహా అన్ని రకాల పన్నులు, చార్జీల పెంపు

నల్లా చార్జీలకు రానున్న రెక్కలు.. మోగనున్న ట్రేడ్‌ లైసెన్స్‌ల మోత 

మునిసిపల్‌ కమిషనర్లకు పురపాలక శాఖ డైరెక్టర్‌ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: కొత్త మునిసిపాలిటీల్లో అప్పుడే బాదుడు ప్రారంభమైంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 68 మునిసిపాలిటీల్లో ఆస్తి పన్నులు మినహాయించి ఇతర పనులైన ఖాళీ స్థలాలపై పన్నులు, నల్లా చార్జీలు, మార్కెట్‌ ఫీజులు, పశు వధశాలల ఫీజులు, మునిసిపల్‌ భవనాలు/గదులు/ కార్యాలయ సముదాయాల అద్దెలు, భవన అనుమతుల ఫీజులు, టౌన్‌ఫ్లానింగ్‌కు సంబంధించిన ఇతర ఫీజులు/చార్జీలు, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు, ఎంక్రోచ్‌మెంట్‌ ఫీజు, మ్యుటేషన్‌ ఫీజు, వినోద పన్ను, స్టాంపు డ్యూటీపై సర్‌చార్జీలను రాష్ట్ర పురపాలక శాఖ చట్టంలోని నిబంధనల మేరకు పెంచాలని సంబంధిత మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి ఈ నెల 25న సర్క్యులర్‌ జారీ చేశారు.

173 గ్రామ పంచాయతీలను అప్‌గ్రేడ్‌ చేసి కొత్తగా 38 మునిసిపాలిటీల ఏర్పాటుతోపాటు పాత మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో మరో 131 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి చివరిలో పురపాలక శాఖ చట్టాలకు సవరణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1, 2వ తేదీల నుంచి 68 కొత్త మునిసిపాలిటీలు మనుగడలోకి రాగా, 131 గ్రామ పంచాయతీలు సంబంధిత మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో విలీనమైపోయాయి. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో వసూలు చేసిన పన్నులు, పన్నేతర చార్జీలు, ఫీజులను ఇకపై పురపాలక శాఖ చట్టాల ప్రకారం పెంచి వసూలు చేయాలని ఆ శాఖ డైరెక్టర్‌ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కొత్త పురపాలికల్లో ఆస్తి పన్నులను మాత్రం పెంచరాదని స్పష్టం చేశారు. మునిసిపాలిటీల చట్టం ప్రకారం కొత్త పురపాలికలు, పురపాలికల్లో విలీనమైన గ్రామాల్లోని ఖాళీ స్థలాలు/ప్లాట్లపై 0.22 శాతం మార్కెట్‌ విలువన ఖాళీస్థలం పన్నుగా వసూలు చేయాలని కోరారు.  

నల్లా చార్జీలకు రెక్కలు  
కొత్త మునిసిపాలిటీల్లో పాలక మండళ్ల తీర్మానంతో నల్లా చార్జీలను పెంచాలని పురపాలక శాఖ ఆదేశించింది. నిబంధనల మేరకు గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు వేర్వేరు చార్జీలను నిర్ణయించాలని సూచించింది. చిన్న హోటళ్లు, వ్యాపార గృహా ల నుంచి కూడా వాణిజ్య కేటగిరీ కింద నీటి చార్జీలు వసూలు చేయనున్నారు. పైప్‌లైన్ల మరమ్మతు, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ వ్యయాన్ని వాటర్‌ డొనేషన్‌ చార్జీల రూపంలో ఏకకాలం(వన్‌టైం)లో వసూలు చేస్తారు. కొత్త మునిసిపాలిటీల్లో నల్లా చార్జీలను పట్టికలో సూచించిన విధంగా నిర్ణయించి వసూలు చేయాలని పురపాలక శాఖ కోరింది.  

భవన నిర్మాణ అనుమతులు ఇక భారం.. 
కొత్త మునిసిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు ఇకపై భారం కానున్నాయి. ఇకపై మునిసిపల్‌ బిల్డింగ్‌ రూల్స్‌(జీవో 168) ప్రకారం భవన నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం నామ మాత్రపు ఫీజులతో అనుమతులు జారీ చేస్తుండగా, ఇకపై మూడో శ్రేణి మునిసిపాలిటీలకు వర్తించే భవన అనుమతుల ఫీజులను కొత్త మునిసిపాలిటీల్లో దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించిన కౌన్సిల్‌ తీర్మానం చేయాలని పురపాలక శాఖ కోరింది.  

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు సైతం.. 
కొత్త పురపాలికల్లో వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక, వినోద అవసరాలకు వినియోగించే భవనాలు, గృహాల నుంచి ఇక ముందు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు వసూలు చేయనున్నారు. కౌన్సిల్‌లో వివిధ రకాల ట్రేడ్‌లకు ఫీజులను నిర్ణయించాలని పురపాలక శాఖ ఆదేశించింది. మ్యుటేషన్‌ ఫీజులను సైతం కౌన్సిల్‌లో నిర్ణయించి వసూలు చేయాలని కోరింది. మునిసిపల్‌ చట్టాల ప్రకారం.. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తున్న వినోద పన్నులో 90శాతం వాటాతోపాటు ఆస్తుల క్రయ విక్రయాల సందర్భంగా రిజిస్ట్రేషన్ల శాఖ వసూలు చేసే స్టాంపు డ్యూటీలో 2 శాతాన్ని సర్‌చార్జీగా మునిసిపాలిటీలు తిరిగి రాబట్టుకోవాలని మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించింది.  

మార్కెట్, పశువధశాలల్లో ఫీజులు 
కొత్త మునిసిపాలిటీల్లోని మార్కెట్లో, పశువధశాలల్లో వ్యాపారుల నుంచి ఫీజులు వసూలు చేసే హక్కులను కాంట్రాక్టర్లకు ఇవ్వాలని మునిసిపల్‌ కమిషనర్లకు పురపాలక శాఖ ఆదేశించింది. అత్యధిక ధర పలికిన కాంట్రాక్టర్‌కు ఫీజులు వసూలు చేసే హక్కులను అప్పగించాలని కోరింది. కాంట్రాక్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానించేందుకు కౌన్సిల్‌ తీర్మానంతో టెండర్‌ ప్రకటన జారీ చేయనున్నారు. మునిసిపాలిటీల స్వీయ నిర్వహణలో ఉన్న మార్కెట్లు, పశువధశాల ల్లో టికెట్ల ద్వారా ఫీజులు వసూలు చేయనున్నారు.మూడేళ్లకోసారి ఈ ఫీజులను పెంచనుంది. కొత్త మునిసిపాలిటీల యాజమాన్యంలోని ఖాళీ స్థలాలు, దుకాణాలు, గోదాములు, భవనాలను కౌన్సిల్‌ తీర్మానంతో కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల కాలా నికి ఆయా మునిసిపాలిటీలు అద్దెకు ఇచ్చుకోవచ్చని పురపాలక శాఖ సూచించింది. మునిసిపాలిటీల చట్టం ప్రకారం అద్దెలు నిర్ణయించాలని తెలిపింది.

మరిన్ని వార్తలు