రూ.10 లక్షల సొత్తుతో ఉడాయించిన టాక్సీ డ్రైవర్

12 Sep, 2015 16:55 IST|Sakshi

శంషాబాద్ : రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మోసపోయారు. వారిద్దరినీ బురిడీ కొట్టించి రూ.10 లక్షల సొత్తుతో కారు డ్రైవర్ పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన ఖలీద్, బోధన్‌కు చెందిన నాసర్ నాలుగేళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఎంజీబీఎస్‌కు వెళ్లేందుకు వారిద్దరూ ఓ కారును మాట్లాడుకున్నారు. అందులో ఎక్కి కొంతదూరం వెళ్లాక...'ఎయిర్‌పోర్టు టాక్సీ స్టాండు వద్ద మీ జేబులో నుంచి కొన్ని కాగితాలు పడిపోవటం చూశాను. అవి పాస్‌పోర్టు, వీసాలాగానే ఉన్నాయి...' అంటూ కారు డ్రైవర్ వారిని తికమకపెట్టాడు.

అతని మాటలు నిజమేననుకున్న ఖలీద్, నాసర్ కారును వెనక్కి తీసుకెళ్లాలని కోరారు. ఎయిర్‌పోర్టు టాక్సీ స్టాండు వద్దకు వెళ్లాక వారిద్దరూ కిందికి దిగి వెతుకులాట మొదలుపెట్టారు. వారు ఏమరుపాటుగా ఉన్న సమయాన్ని గమనించి కారు డ్రైవర్ వారి లగేజీతో మాయమయ్యాడు. మోస పోయామని గ్రహించిన బాధితులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బ్యాగుల్లో 450 కువైట్ దినార్లు, 10 సెల్‌ఫోన్లు, 5 తులాల బంగారు ఆభరణాలు తదితర రూ.10 లక్షల విలువైన సొత్తు ఉందని వారు పేర్కొన్నారు. అయితే, శనివారం సాయంత్రం వరకు ఆ కేసు దర్యాప్తు ప్రారంభం కాలేదనే సమాచారం మేరకు వారు జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన జోక్యం చేసుకోవటంతో పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు