సింగరేణి గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్‌

6 Dec, 2017 03:39 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి గుర్తింపు యూనియన్‌గా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌)ను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రకటించింది. అక్టోబర్‌ 5న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ కార్మిక అనుబంధ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఏఐటీయూసీ గుర్తు మీద పోరాడినప్పటికీ, 4,217 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్‌ విజయం సాధించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు గత నెల 30న ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తూ లేఖ రాసింది.

ఈ కాపీలను ఢిల్లీలోని చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ (సీఎల్‌సీ), హైదరాబాద్‌లోని డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌కు కూడా పంపించింది. దీంతో టీబీజీకేఎస్‌ వరుసగా రెండోసారి అధికార సింగరేణి గుర్తింపు యూనియన్‌గా నిలిచింది. అక్టోబర్‌ 5న జరిగిన ఎన్నికల్లో మొత్తం 49,877 ఓట్లకు గాను 15 సంఘాలు పోటీ పడగా, టీబీజీకేఎస్‌ 23,848 ఓట్లు సాధించింది. ఏఐటీయూసీ 19,631 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచింది. మిగతా సంఘాలకు నామమాత్రపు ఓట్లు మాత్రమే లభించాయి. సింగరేణిలోని 11 ఏరియాలకు గాను టీబీజీకేఎస్‌ తొమ్మిదింట, ఏఐటీయూసీ రెండింట విజ యం సాధించాయి. కేంద్ర కార్మిక శాఖ టీజీబీకేఎస్‌ను అధికార యూనియన్‌గా గుర్తించిన నేపథ్యంలో టీబీజీకేఎస్‌కు ఇక గుర్తింపు పత్రం తీసుకొని కమిటీ ఏర్పా టు చేయడమే మిగిలింది. కాగా, గతంలో గుర్తింపు సంఘం కాల పరిమితి పదే ళ్లు ఉండగా, ప్రస్తుతం దానిని రెండేళ్లకు కేంద్ర ప్రభుత్వం పరిమితం చేసింది. 

మరిన్ని వార్తలు