ఫలించిన ‘కారుణ్య’ మంత్రం!

7 Oct, 2017 02:07 IST|Sakshi

కేసీఆర్‌ హామీతో టీబీజీకేఎస్‌ ఘన విజయం

వ్యతిరేకతను అనుకూలంగా మార్చిన సీఎం

కూటమిగా పోటీ చేసినా  రెండో స్థానంలో ఏఐటీయూసీ

బీజేపీ అనుబంధ సంఘానికి 246 ఓట్లే..  

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యూహం ఫలించింది. కార్మికుల ఆకాంక్షను గుర్తించి తదనుగుణంగా స్పందించడం.. టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) విజయానికి కారణమైంది. ప్రజాప్రతినిధులను కార్మిక వాడల్లోకి, బొగ్గు గనుల వద్దకు పంపించి.. అధికార పక్షంపై నమ్మకాన్ని పెంచడంలో కేసీఆర్‌ సఫలీకృతులయ్యారు. ‘కారుణ్య’నియామకాల పేరిట వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతోపాటు కార్మికులకు ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షల వడ్డీ లేని రుణం, మారుపేరు (అలియాస్‌) మీద పనిచేస్తున్న కార్మికులను సొంతపేరిట క్రమబద్ధీకరించడం, సింగరేణి క్వార్టర్లకు ఏసీ సౌకర్యం వంటి హామీలతో ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీటిని కార్మికుల్లోకి తీసుకెళ్లేలా సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత స్వయంగా రెండు రోజులు చేసిన ప్రచారం కూడా ప్రభావం చూపింది. 

శ్రీరాంపూర్‌తో పట్టు 
సింగరేణిలో అత్యధిక ఓట్లున్న డివిజన్‌ శ్రీరాంపూర్‌. ఇక్కడ మొత్తం 11,862 ఓట్లు ఉండగా.. 11,266 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఏ యూనియన్‌కు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ యూనియన్‌కే గుర్తింపు సంఘం అవకాశం ఎక్కువ. సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన సమయానికి శ్రీరాంపూర్‌లో ఏఐటీయూసీ కూటమివైపే కార్మికులు అధికంగా మొగ్గు చూపినట్లు ఇంటెలిజెన్స్‌ సర్వే ద్వారా టీఆర్‌ఎస్‌ నాయకత్వం గుర్తించింది. దీంతో వెంటనే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను, సీఎంవో పరిశీలకుడిగా శ్రవణ్‌ను రంగంలోకి దింపి.. పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టింది. వారు వ్యూహాత్మకంగా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ తదితర సంఘాల్లోని వారిని టీబీజీకేఎస్‌లో చేర్పించారు. దీనికితోడు సీఎం హామీలు, ఇతర అంశాలు కలసి టీబీజీకేఎస్‌ ఇక్కడ 6,189 ఓట్లు సాధించింది. మెరుగైన ఫలితం సాధిస్తుందని భావించిన ఏఐటీయూసీ 3,946 ఓట్లకే పరిమితమైంది. టీబీజీకేఎస్‌ ఇక్కడ సాధించిన 2,243 ఓట్ల ఆధిక్యతే.. గుర్తింపు సంఘంగా ఎన్నికయ్యేందుకు కీలకంగా మారిందని చెప్పవచ్చు. 

రామగుండంలో హెచ్‌ఎంఎస్‌ ఎఫెక్ట్‌ 
రామగుండం రీజియన్‌లోని ఆర్‌జీ–1, ఆర్‌జీ–2, ఆర్‌జీ–3 డివిజన్లలో హెచ్‌ఎంఎస్‌ ప్రభావం ఎక్కువ. గతంలో ఇక్కడి రెండు డివిజన్లలో ప్రాతినిధ్యం వహించిన హెచ్‌ఎంఎస్‌ను టీబీజీకేఎస్‌ వ్యూహాత్మకంగా దెబ్బతీసింది. ఈ యూనియన్‌ అధ్యక్షుడిగా ఉన్న టీఆర్‌ఎస్‌ నేత ఎస్‌.వేణుగోపాలచారిని టీబీజీకేఎస్‌లో చేర్చుకున్నారు. హెచ్‌ఎంఎస్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో తమ యూనియన్‌ టీబీజీకేఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటింపజేశారు. దీంతో కార్మికుల్లో గందరగోళం తలెత్తింది. చివరికి హెచ్‌ఎంఎస్‌ నేతలు.. ‘హెచ్‌ఎంఎస్‌కు ఓటేయకపోయినా ఫరవాలేదు. టీబీజీకేఎస్‌కు మాత్రం వేయొద్దు..’’అంటూ ప్రచారం చేసినా నష్టం జరిగిపోయింది. హెచ్‌ఎంఎస్‌కు ఆర్‌జీ–1లో 787, ఆర్‌జీ–2లో 895, ఆర్‌జీ–3లో 488 ఓట్లు వచ్చాయి. ఈ మూడు డివిజన్లలో ఏఐటీయూసీ కూటమి స్వల్ప తేడాతో ఓడిపోవడం గమనార్హం. హెచ్‌ఎంఎస్‌ ఓట్లు ఏఐటీయూసీకి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయేది. ఇక బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) సింగరేణి ఎన్నికల్లో ఉనికిలో లేకుండా పోయింది. సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ పేరుతో పోటీ చేసిన ఈ సంఘం తరఫున బీజేపీ రాష్ట్ర నేత కిషన్‌రెడ్డి వంటి నాయకులు ప్రచారం చేసినా మొత్తంగా 246 ఓట్లే సాధించింది.  

కూటమిని దెబ్బతీసిన అతి నమ్మకం
ఈసారి టీబీజీకేఎస్‌ను ఓడించి తీరుతామని ఏఐటీయూసీ కూటమి తొలి నుంచీ ధీమాతో ఉంది. వారసత్వ ఉద్యోగాలను సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాన్ని ఏఐటీయూసీ సహా జాతీయ సంఘాలన్నీ అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నించాయి. కార్మికుల్లో టీబీజీకేఎస్‌పై వ్యతిరేకతను గుర్తించి కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ కలసి పోటీ చేయగా.. టీడీపీ అనుబంధ టీఎన్‌టీయూసీ మద్దతిచ్చింది. హెచ్‌ఎంఎస్‌ మాత్రం కలసి రాలేదు. అయితే కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఆయా యూనియన్ల నాయకుల్లో గెలుపుపై ధీమా వ్యక్తమైంది. దీనిని గుర్తించిన టీబీజీకేఎస్‌ నేతలు వ్యూహాత్మకంగా ఆయా ఏరియాల్లో ప్రభావం చూపే నాయకులను, కార్మికులను చేర్చుకుని దెబ్బకొట్టారు.

మరిన్ని వార్తలు