తాండూరులో టీడీపీ ఖాళీ!

21 Nov, 2018 19:12 IST|Sakshi
టీడీపీ నాయకులతో రాజుగౌడ్‌

 నేడు టీడీపీకి గుడ్‌బై చెప్పనున్న నియోజవర్గ ఇన్‌చార్జ్‌ రాజుగౌడ్‌  

పార్టీ నేతలంతా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం 

సాక్షి, తాండూరు: తాండూరులో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుంది. రెండు దశాబ్దాల పాటు తాండూరులో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభావం నేడు పూర్తిగా అధమ స్థానంలో వెళ్లిపోతుంది. 2014 సార్వత్రిక ఎన్నికలలోనే టీడీపీ పూర్తిగా బలం తగ్గిపోయింది. ముందస్తు ఎన్నికల సందర్భంగా ఒక్కబాబు కూడా మహకూటమిలో లేకుండా పోతున్నారు. టీడీపీ తాండూరు నియోజవకర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న సందల్‌ రాజుగౌడ్‌ తన అనుచర వర్గంతో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరేందుకు మూహుర్తం ఖరారుతో టీడీపీ శకం ముగిసింది. తాండూరు రాజకీయాలలో నాలుగు దశాబ్ధాలుగా తెలుగు దేశం పార్టీ బలమైన రాజకీయ పార్టీగా కొనసాగింది. 1994 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ తరపున పోటి చేసిన పట్నం మహేందర్‌రెడ్డి విజయం సాధించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. నాటి నుంచి టీడీపీ తరపున మూడు సార్లు విజయం సాధించారు. మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు ఆయన సతీమణిని జెడ్పీ చైర్‌పర్సన్‌గా గెలిపించుకున్నారు. తమ్ముడు నరేందర్‌రెడ్డిని టీడీపీ తరపున ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. అయితే 2014లో పట్నం మహేందర్‌రెడ్డి టీడీపీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మహేందర్‌రెడ్డితో పాటు పార్టీ శ్రేణులంతా కారెక్కారు.

25న టీఆర్‌ఎస్‌లో చేరనున్న రాజుగౌడ్‌.. 
టీడీపీ వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రాజుగౌడ్‌ నేడు(బుధవారం) టీడీపీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2014లో టీడీపీ నియోజవకర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. అయితే మహాకూటమి అభ్యర్థితో ఉన్న మనస్పర్ధల కారణంగా పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నారు. ఆయనతో పాటు తాండూరు మున్సిపల్‌ కౌన్సిలర్లు సుమిత్‌కుమార్‌గౌడ్, వినోద్‌జైన్‌లు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. అయితే తాండూరు నియోజకవర్గంలోని మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు బుధవారం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో తాండూరులో టీడీపీ ప్రభావం పూర్తిగా తగ్గినట్లయ్యింది. రాజుగౌడ్‌ మాత్రం ఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో కారు ఎక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

మరిన్ని వార్తలు