టీడీపీ బస్సుయాత్రకు పంక్చర్ !

11 Oct, 2014 02:06 IST|Sakshi
టీడీపీ బస్సుయాత్రకు పంక్చర్ !
  •  కారెక్కుతున్న చల్లా ధర్మారెడ్డి    
  •  స్వయంగా ప్రకటించిన పరకాల ఎమ్మెల్యే
  •  నేడు జిల్లాలో టీడీపీ బస్సు యాత్ర
  •  అయోమయంలో ‘తమ్ముళ్లు’
  •  పరకాల టీఆర్‌ఎస్‌లో పెరిగిన నేతలు
  • సాక్షిప్రతినిధి, వరంగల్ : కరెంట్ సరఫరా విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన బస్సు యాత్ర శనివారం జిల్లాలో జరగనుంది. బస్సు యాత్రకు సరిగ్గా ఒక్క రోజు ముందే టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీఆర్‌ఎస్ ఆకర్ష్‌తో టీడీపీకి మరో భారీ దెబ్బ పడింది. మంచి రోజు చూసుకుని త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు టీడీపీకి చెందిన పరకాల ఎమ్మెల్యే శుక్రవారం స్వయంగా ప్రకటించారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రకు ధర్మారెడ్డి ప్రకటన ఇబ్బందికరంగా మారింది.

    జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీ మారుతుండడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ధర్మారెడ్డి వెంట ఎంత మంది వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంత జిల్లాలోనే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు కారెక్కుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం టీఆర్‌ఎస్‌లో చేరుతారని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. దీన్ని ఆయన స్పష్టంగా ఖండించారు.

    ఈ ప్రచారాన్ని తగ్గించేందుకు ఇటీవల ముఖ్యమంత్రి పైనా, ప్రభుత్వంపైనా విమర్శలను పెంచారు. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ని అనువుగా మార్చుకునేందుకు ఎమ్మెల్యేలతో బస్సు యాత్ర మొదలుపెట్టారు. శుక్రవారం నల్లగొండలో మొదలైన బస్సు యాత్ర శనివా రం మన జిల్లాకు చేరనుంది. టీడీపీ చెందిన ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు ఈ యాత్ర లో పాల్గొననున్నారు.

    సాధారణ ఎన్నికల తర్వాత టీడీపీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ఈ బస్సు యాత్రే. ధర్మారెడ్డి మొదటి నుంచి దయాకర్‌రావుకు సన్నిహితుడు. కీలకమైన బస్సుయాత్ర సమయంలోనే ధర్మారెడ్డి... టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలు, కేసీఆర్ ప్రణాళి కలు బాగున్నాయని ప్రశంసించడం టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ధర్మారెడ్డి రాజ కీయప్రకటన బస్సుయాత్ర ప్రాధాన్యాన్ని తగ్గిం చేదిగా ఉందని టీడీపీ నేతలు వాపోతున్నారు.
     
    పరకాలలో నాలుగు స్తంభాలాట...

    చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్ చేరడం ఖాయమైన నేపథ్యంలో అక్కడి రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పరంగా ఇప్పటికే మూడు వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే ధర్మారెడ్డి అదే పార్టీలో చేరడంతో గులాబీ రాజకీయం మరింత జోరుగా సాగే అవకాశం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన ముద్దసాని సహోదర్‌రెడ్డిపై చల్లా ధర్మారెడ్డి గెలిచారు. ప్రస్తుతం పరకాల టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తానేనని సహోదర్‌రెడ్డి చెబుతున్నారు.

    చల్లా ధర్మారెడ్డి చేరిక తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనే ఇన్‌చార్జ్‌అయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పుడు సహోదర్‌రెడ్డి, ధర్మారెడ్డి ఎలా ఉంటారో వేచి చూడాల్సి ఉంది. 2009 ఎన్నికల వరకు పరకాల ఎమ్మెల్యేగా ఉన్న మొలుగూరి బిక్షపతికి  నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. పరకాల సెగ్మెంట్‌లో సుదీర్ఘకాలం ఆధిపత్యం ఉన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుకు ప్రతి గ్రామంలో కేడర్ ఉంది. ఇప్పుడు ఈ నలుగురు నేతలకు సంబంధించిన టీఆర్‌ఎస్ నాయకులు, అనుచరులు క్షేత్ర స్థాయిలో ఎలా సర్దుకుంటారో త్వరలోనే తేలనుంది.
     
    కేసీఆర్ మాటే ఫైనల్
    తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీని బలోపేతం చేయడం కోసం కేసీఆర్ అందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇతరల పార్టీల నుంచి వచ్చే వారితో మరింత బలం పెరుగుతుంది. మా పార్టీలోకి ఎవరు వచ్చినా... అభ్యంతరం లేదు. కేసీఆర్ ఏది చెప్పినా మాకు ఓకే. ఆయన మాటనే మాకు ఫైనల్.
     - మొలుగూరి బిక్షపతి, మాజీ ఎమ్మెల్యే

    కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
    టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడం కోసం కేసీఆ ర్ అందరిని కలుపుకుని పోతున్నారు. ముఖ్యం గా టీడీపీని నిర్మూలించడం కోసం కేసీఆర్ చేస్తు న్న చర్యలను స్వాగతిస్తున్నాం. 2001 నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించాలి. త్వరలో చేరబోయే ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ బలోపేతం కోసం పనిచేసి న నాయకులకు ప్రాధాన్యమివ్వాలి.
     - ముద్దసాని సహోదర్‌రెడ్డి
     

మరిన్ని వార్తలు